బెంగళూరు వేదికన జరిగిన టీ20 మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాభవాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. పర్యాటక సౌతాఫ్రికా మొహాలీ టీ20 ఓటమి తర్వాత అనూహ్యంగా పుంజుకుని అద్భుత విజయాన్ని అందుకుంది. వన్డే ప్రపంచ కప్ తర్వాత వరుస విజయాలతో  దూసుకుపోతున్న టీమిండియా జోరుకు ఈ ఓటమితో బ్రేక్ పడింది. ఇలా భారత్ ఆటగాళ్లు, అభిమానులు తీవ్ర నిరాశకు గురయిన ఈ మ్యాచ్ లోనే ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. దీంతో కాస్సేపు ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా సరదాగా నవ్వుకున్నారు. 

నిర్ణయాత్మక మూడో టీ20లో కోహ్లీసేన టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే సౌతాఫ్రికా బౌలర్లు చెలరేగడంతో వెంటవెంటనే భారత టాప్ ఆర్డర్ వికెట్లను కోల్పోయింది. మ్యాచ్ ఆరంభంలోనే  ఓపెనర్ రోహిత్ ఔటవగా కొద్దిసేపటికే మరో ఓపెనర్  శిఖర్ ధవన్ కూడా పెవిలియన్ చేరాడు. మూడో స్థానంలో అప్పటికే కెప్టెన్ కోహ్లీ క్రీజులో వుండగా నాలుగో స్థానంలో బరిలోకి దిగే ఆటగాడు మైదానంలోకి రావాల్సివుంది.

అయితే ధవన్ మైదానాన్ని వీడిన వెంటనే  ఇద్దరు ఆటగాళ్లు బ్యాటింగ్  కోసం మైదానంలో అడుగుపెట్టారు. రెగ్యులర్ గా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న రిషబ్ పంత్ తో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా బరిలోకి దిగేందుకు సిద్దమయ్యారు. ఇలా కన్ప్యూజన్ లో వారిద్దరు కాస్సేపు మైదానంలోనే వున్నారు. ఆ తర్వాత అయ్యర్ తిరిగి డ్రెస్సింగ్ రూంకి వెళ్లిపోగా పంత్ క్రీజులోకి చేరుకుని కోహ్లీతో జతకట్టాడు. 

ఇలా ఇద్దరు ఆటగాళ్లు ఒకేసారి బ్యాటింగ్ రావడం అభిమానులు మొదట ఆశ్యర్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఆటగాళ్ల మధ్య కన్ప్యూజన్ వల్లే ఇలా జరిగినట్లు తెలియడంతో ఆశ్యర్యం స్థానంలో నవ్వులు పూశాయి. ఈ ఘటన సీరియస్ పరిస్థితుల్లో బ్యాటింగ్ చేస్తున్న తనను కూడా నవ్వుకునేలా చేసిందని కోహ్లీ తెలిపాడు.

మ్యాచ్ అనంతరం కోహ్లీ ఈ సంఘటన గురించి మాట్లాడుతూ...  ''ఆటగాళ్లకు, టీం మేనేజ్‌మెంట్ కు మధ్య సమాచారలోపం వల్లే ఇలా జరిగింది.  10ఓవర్లకు ముందయితే శ్రేయాస్ అయ్యర్, 10ఓవర్ల తర్వాత అయితే రిషబ్ పంత్ ఆ స్థానంలో బరిలోకి దించాలన్నది మా వ్యూహం. ఈ  విషయాన్నే బ్యాటింగ్ కోచ్ వారిద్దరికి తెలియజేశాడు. కానీ ఇది వారికి సరిగ్గా అర్థం కానట్లుంది. అందువల్లే కన్ప్యూజన్ తో ఇద్దరూ ఒకేసారి బ్యాటింగ్ కు సిద్దమయ్యారు.'' అని కోహ్లీ వివరించాడు.