Shreyas Iyer: టీమిండియా మిడిలార్డర్ లో కీలక ఆటగాడిగా ఎదుగుతున్న శ్రేయస్ అయ్యర్ సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. గురువారం లంకతో జరిగిన తొలి టీ20లో కూడా అతడు దుమ్ముదులిపాడు. తుఫాను ముందు ప్రశాంతతలా ప్రారంభమైన అతడి ఇన్నింగ్స్ ఆఖరుకు...
ఎవరైనా ఆటగాడు ఫోర్ గానీ సిక్సర్ గానీ కొడితే అది ఎక్కడ పడిందోనని ఆసక్తిగా చూస్తారు. ఒకవేళ అది వాళ్లు ఊహించని చోట పడితే ఆ ఆటగాడి ఆనందానికి అంతేఉండదు. అయితే టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఇందుకు మినహాయింపు. ఎందుకంటే సిక్సర్ కొట్టినాక కనీసం దాని వంక కూడా చూడలేదు అయ్యర్.. సిక్సర్ అంటే ఏదో అల్లా టప్పా షాట్ కూడా కాదు.. స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడి.. అది ఎక్కడ పడుతుందో కూడా చూడలేదు. ఇక నిన్నటి మ్యాచులో తుఫాను ముందు ప్రశాంతతలా ప్రారంభమైన అతడి ఇన్నింగ్స్ ఆఖరుకు.. లంకకు భారీ నష్టాన్ని మిగిల్చింది.
గురువారం శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్ సందర్బంగా ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. రోహిత్ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చాడు శ్రేయస్ అయ్యర్. తొలి 15 పరుగుల దాకా బంతికో పరుగు అన్న రీతిలో ఆడిన అతడు తర్వాత జూలు విదిల్చాడు.

ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన చమీర కరుణరత్నేకు చుక్కలు చూపించాడు అయ్యర్.. ఆ ఓవర్లో తొలి బంతిని కరుణరత్నే స్లో డెలివరీగా సంధించాడు. బంతి పడటానికంటే ముందే.. క్రీజుకు ముందు వచ్చి ఆడిన అయ్యర్ ఆ బంతిని స్క్వేర్ లెగ్ దిశగా కొట్టాడు. ఆ బంతి కాస్తా.. 90 మీటర్ల దూరంలో పడింది. సిక్సర్ ను కొట్టిన అయ్యర్.. కనీసం ఆ బంతిని చూడటం కూడా చూడలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఈ సిక్సర్ ను ఫ్యాన్స్ ‘నో లుక్ సిక్స్’గా అభివర్ణిస్తూ ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో, వీడియోలను షేర్ చేస్తున్నారు. కరుణరత్నే వేసిన ఈ ఓవర్లో ఓ సిక్సర్ తో పాటు మూడు బౌండరీలు రాబట్టిన అయ్యర్.. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20లలో అయ్యర్ కు ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. మొత్తంగా నిన్నటి మ్యాచులో అయ్యర్.. 28 బంతులాడి 57 పరుగులు చేశాడు.
అయ్యర్ కంటే ముందు ఇషాన్ కిషన్ లంక బౌలర్లను ఓ ఆడుకున్నాడు. 56 బంతుల్లోనే పది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేశాడు. రోహిత్ తో కలిసి తొలి వికెట్ కు 111 పరుగులు జోడించిన ఇషాన్.. తర్వాత అయ్యర్ తో కలిసి 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వీర విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి.. చివరికి శనక వేసిన 17వ ఓవర్లో ఔటయ్యాడు. ఈ ముగ్గురి ఆటతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది. 200 పరుగుల విజయలక్ష్యంతో ఛేదన ప్రారంభించిన లంక.. 20 ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
