రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం... వన్డేల్లో రెండో సెంచరీ నమోదు చేసిన శ్రేయాస్ అయ్యర్... 93 పరుగులు చేసి అవుటైన ఇషాన్ కిషన్...
మొదటి వన్డేలో 9 పరుగుల తేడాతో పోరాడి ఓడిన భారత జట్టు, రెండో వన్డేలో ఘన విజయాన్ని అందుకుంది. రాంఛీలో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాని ఓడించిన భారత జట్టు 1-1 తేడాతో సిరీస్‌ని సమం చేసింది. మొదటి వన్డేలో జిడ్డు బ్యాటింగ్‌తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిన ఇషాన్ కిషన్, సొంత గ్రౌండ్ రాంఛీలో జరుగుతున్న రెండో వన్డేలో చెలరేగిపోయాడు. 93 పరుగులు చేసిన ఇషాన్, సెంచరీని 7 పరుగుల తేడాతో మిస్ చేసుకోగా శ్రేయాస్ అయ్యర్ ఆ మార్క్‌ని దాటేసి వన్డేల్లో రెండో సెంచరీ నమోదు చేశాడు...
20 బంతుల్లో ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసి శిఖర్ ధావన్ నిరాశపరచగా శుబ్‌మన్ గిల్ 26 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 279 పరుగుల లక్ష్యఛేదనలో 48 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు.
ఈ దశలో ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ కలిసి మూడో వికెట్‌కి 161 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సౌతాఫ్రికాపై వన్డేల్లో మూడో వికెట్‌కి ఇదే రెండో అత్యుత్తమం. ఇంతకుముందు విరాట్ కోహ్లీ, అజింకా రహానే 189 పరుగులు జోడించి టాప్‌లో ఉన్నారు. 84 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 93 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, జోర్న్ ఫోరిన్ బౌలింగ్‌లో హెన్రిక్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... వన్డేల్లో సౌతాఫ్రికాపై అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్‌గా యూసఫ్ పఠాన్ (8 సిక్సర్లు) తర్వాత ప్లేస్‌లో నిలిచాడు ఇషాన్ కిషన్..
103 బంతుల్లో 14 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్‌తో కలిసి నాలుగో వికెట్‌కి హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. శ్రేయాస్ అయ్యర్ 111 బంతుల్లో 15 ఫోర్లతో 113 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా సంజూ శాంసన్ 36 బంతుల్లో ఓ సిక్సర్, ఓ ఫోర్‌తో 30 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించాడు.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన మహ్మద్ సిరాజ్, టీమిండియాకి తొలి బ్రేక్ అందించాడు. 31 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేసిన జానెమ్నన్ మలాన్, తొలి వన్డే మ్యాచ్ ఆడుతున్న షాబజ్ అహ్మద్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 40 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా...
ఈ దశలో రీజా హెన్రిక్స్, అయిడిన్ మార్క్‌రమ్ కలిసి మూడో వికెట్‌కి 129 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు.76 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 74 పరుగులు చేసిన రీజా హెన్రిక్స్‌కి అవుట్ చేసిన మహ్మద్ సిరాజ్, టీమిండియాకి అవసరమైన బ్రేక్‌ని అందించాడు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసిన్, అయిడిన్ మార్క్‌రమ్ కలిసి ఐదో వికెట్‌కి 48 పరుగుల భాగస్వామ్యం జోడించారు...
26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసిన్‌ని కుల్దీప్ యాదవ్ అవుట్ చేయగా 89 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 79 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
వోన్ పార్నెల్ 22 బంతుల్లో 16 పరుగులు చేసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరగా 13 బంతుల్లో 5 పరుగులు చేసిన కేశవ్ మహరాజ్‌ని మహ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 34 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు డేవిడ్ మిల్లర్.
భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 10 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 38 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఇంప్రెసివ్ స్పెల్ వేశాడు. దీపక్ చాహార్ స్థానంలో వచ్చిన వాషింగ్టన్ సుందర్ 9 ఓవర్లలో 60 పరుగులిచ్చి ఓ వికెట్ తీయగా ఆరంగ్రేటం వన్డే ఆడుతున్న షాబాజ్ అహ్మద్ 10 ఓవర్లలో 54 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు...ఆవేశ్ ఖాన్ 7 ఓవర్లలో 35 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోగా కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్‌లకు చెరో వికెట్ దక్కింది.
