Shreyas Iyer: ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు సారథిగా వ్యవహరించనున్న  టీమిండియా టాపార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్  అరుదైన ఘనత సాధించాడు. కోహ్లిని వెనక్కినెట్టి.. 

టీమిండియా టాపార్డర్ బ్యాటర్, ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు సారథ్యం వహిస్తున్న శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ సందర్భంగా వరుసగా మూడు మ్యాచులలో హాఫ్ సెంచరీలతో చెలరేగిన అయ్యర్.. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లితో పాటు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తర్వాత సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో కోహ్లిని అధిగమించి అతడి రికార్డును బ్రేక్ చేశాడు. 

శ్రీలంకతో మూడు మ్యాచులు టీ20 సిరీస్ సందర్భంగా అయ్యర్.. తొలి మ్యాచులో 57 పరుగులు చేశాడు. ఇక రెండో మ్యాచులో 44 బంతుల్లోనే 74 పరుగులు చేయగా.. ఆఖరుదైన మూడో మ్యాచులో 73 పరుగులు చేశాడు. మూడు సార్లు అతడు నాటౌట్ గానే నిలవడం గమనార్హం. 

మూడు ఇన్నింగ్సులలో కలిపి 204 పరుగులు చేశాడు అయ్యర్. దీంతో గతంలో ఒక సిరీస్ (మూడు మ్యాచుల)లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కిన విరాట్ కోహ్లి రికార్డును అయ్యర్ బ్రేక్ చేశాడు. విరాట్.. 2016లో ఆస్ట్రేలియాపై 199 రన్స్ చేశాడు.

Scroll to load tweet…

ఇక అయ్యర్ సాధించిన మూడు బ్యాక్ టు బ్యాక్ 50 ప్లస్ స్కోర్ల రికార్డును కోహ్లి 2012లోనే సాధించాడు. తిరిగి.. 2014, 2016 లో కూడా ఈ ఫీట్ చేశాడు. టీమిండియా ప్రస్తుత సారథి రోహిత్ శర్మ కూడా 2018లో మూడు బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు చేశాడు. కేఎల్ రాహుల్.. 2018, 2021 లో ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్మెన్ అయ్యాడు. ఇప్పుడు వీరి సరసన అయ్యర్ చేరాడు. 

Scroll to load tweet…

ఇదిలాఉండగా.. ద్వైపాక్షిక సిరీస్ లో మూడు అర్థశతకాలు ప్లస్ స్కోర్ చేసి నాటౌట్ గా ఉన్న రెండో ఆటగాడిగా అయ్యర్ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు గతంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. 2019లో శ్రీలంకతో టీ20 సిరీస్ సందర్భంగా వార్నర్ ఈ ఫీట్ సాధించాడు. 

ఆదివారం ధర్మశాల వేదికగా ముగిసిన మూడో వన్డేలో భారత జట్టు.. శ్రీలంక నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్లలోనే ఛేదించింది. భారత బౌలర్ల జోరుకు తొలుత తడబడిన లంక.. 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. కానీ కెప్టెన్ శనక (38 బంతుల్లో 74 నాటౌట్), చండిమాల్ (22) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా.. ఆదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మ (5), సంజూ శాంసన్ (18) వికెట్లను కోల్పోయినా.. అయ్యర్ (45 బంతుల్లో 73 నాటౌట్), దీపక్ హుడా (21), రవీంద్ర జడేజా (22 నాటౌట్) లు రాణించడంతో మరో మూడు ఓవర్లు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత జట్టు వరుసగా మూడు సిరీస్ (విండీస్ తో వన్డే, టీ20, లంకతో టీ20) లను నెగ్గింది. టీ20లలో ఇది భారత్ కు వరుసగా 12వ విజయం.