అత్యంత చిన్నవయసులో టెస్టు క్రికెట్ ఆడిన వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేసిన పార్థివ్ పటేల్... రెండు రోజుల క్రితం అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్ తర్వాత తన గురించి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు పార్థివ్ పటేల్.

వికెట్ల వెనకాల వికెట్ కీపింగ్ చేసే వ్యక్తికి చేతి వేళ్లు దృఢంగా ఉండడం చాలా ముఖ్యం. 150+ కి.మీ.ల వేగంగా దూసుకొచ్చే బంతిని వొడిసిపట్టుకునే చేతులు, ఆ వేగాన్ని నియంత్రించగలగాయి. పార్థవ్ పటేల్‌కి 6 ఏళ్లు ఉన్నప్పుడు డోర్ మధ్యలో పడి ఎడమ చేతి చిటికెన వేలు సగానికి తెగిపోయిందిట.

అప్పటి నుంచి పార్థివ్ పటేల్‌కి 9 వేళ్లే ఉన్నాయి. 10వ వేలు లేకపోవడం వల్ల ఏర్పాడిన ఖాళీ నుంచి బంతి జారిపోకుండా ఉండేందుకు గ్లోవ్స్‌కి టేప్ అతికించేవాడట. రెండు వేళ్లను కలిపినట్టుగా అతికించే ఈ టేప్‌ ఎన్నో క్యాచులను అందుకునేందుకు ఉపయోగపడిందట.  

తొమ్మిది వేళ్లతోనే క్రికెట్ కెరీర్ కొనసాగించిన పార్థివ్ పటేల్, దేశవాళీ క్రికెట్‌లో సంచలన ప్రదర్శన ఇచ్చాడు. భారీ హైప్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి దూసుకొచ్చిన పార్థివ్ పటేల్, ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. 

193 లిస్టు ఏ మ్యాచులతో పాటు 194 ఫస్ట్ క్లాస్ గేమ్స్ ఆడిన పార్థివ్ పటేల్... తన కెరీర్‌లో 16వేలకు పైగా పరుగులు రాబట్టాడు. దేశవాళీ క్రికెట్‌లోనీ టోర్నీలన్నీ గెలిచిన ఏకైక వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు పార్థివ్ పటేల్...