ప్రమాద సమయంలో కారులో ఉన్న డబ్బు, నగలు తీసుకుని పారిపోయిన జనాలు... అతికష్టం మీద బయటికి వచ్చి, అంబులెన్స్‌కి ఫోన్ చేసిన రిషబ్ పంత్! 

భారత యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు, నేటి ఉదయం న్యూఢిల్లీ సమీపంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. వేగంగా వెళ్తున్న కారు, డివైడర్‌ని ఢీకొట్టి బోల్తా పడింది. కొద్ది దూరం రాసుకుపోవడంతో కారులో మంటలు వ్యాపించి, పూర్తిగా దగ్ధమైంది... 

ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తలకు, కాళ్లకు, వెన్నెముకకు తీవ్రంగా గాయాలయ్యాయి. రిషబ్ పంత్‌కి నిర్వహించిన మొదటి ఎక్స్‌రేలో అతనికి ఎలాంటి ఫ్రాక్చర్ కాలేదని తేలింది. అయితే డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేసేవరకూ ఈ విషయంపై పూర్తి క్లారిటీ రాదు...

Scroll to load tweet…

కారు రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత అందులో నుంచి బయటికి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు రిషబ్ పంత్‌. కారు, రోడ్డు డివైడర్‌ని ఢీకొట్టిన 6 నిమిషాల తర్వాత మంటలు వ్యాపించాయి. మంటలు రావడానికి ముందే అటుగా వెళ్తున్న వాహనదారులతో పాటు స్థానికులు, కారు ప్రమాదాన్ని గుర్తించారు. ఈ సమయంలో వేగంగా కారు వద్దకి వచ్చిన జనాలు, కారులో ఇరుక్కున్న రిషబ్ పంత్‌ని రక్షించడానికి బదులుగా కారులో ఉన్న విలువైన నగలు, డబ్బులు తీసుకుని పారిపోయారట...

న్యూ ఇయర్‌కి తల్లికి సర్‌ప్రైజ్ ఇవ్వాలని ఇంటికి బయలుదేరిన రిషబ్ పంత్, తల్లిదండ్రుల కోసం, సోదరి కోసం కొన్ని కానుకలు కొనుగోలు చేశాడు. అలాగే రిషబ్ పంత్‌కి ఉండే బంగారు గొలుసు, బ్రాస్‌లైట్ వంటి ఖరీదైన వస్తువులు అపహరణకు గురైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రిషబ్ పంత్ కోలుకుని, ఈ విషయంపై నోరు విప్పితే కానీ అసలు ఏం జరిగిందనే విషయంపై క్లారిటీ రాదు... 

దీంతో ఏం చేయాలో తెలియని రిషబ్ పంత్, అతి కష్టం మీద బయటికి వచ్చి అంబులెన్స్‌కి ఫోన్ చేశాడని తెలుస్తోంది. నిస్సహాయ స్థితిలో రోడ్డు మధ్యలో ఉన్న ప్రాంతంలో రిషబ్ పంత్ పడిపోయాడు. కారు మొత్తం మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. కారు మంటల్లో కాలిపోతున్న చాలామంది వాహనదారులు పట్టించుకోకుండా పక్కనుంచి వెళ్లిపోవడం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైంది...

తీవ్ర గాయాలతో పడి ఉన్న రిషబ్ పంత్‌ని గుర్తించిన మరికొందరు ప్రయాణీకులు మాత్రం అతనికి సాయం చేసి, పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించారు.