ప్రపంచ కప్ కు ముందు ఇంగ్లాండ్-పాకిస్థాన్ ల మధ్య ఓ టీ20, ఐదు వన్డేల సీరిస్ జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే ఇంగ్లాండ్ కు చేరుకున్న పాక్ జట్టు సాధన కూడా మొదలుపెట్టింది. అయితే మరో ఐదారు రోజుల్లో సీరిస్ ప్రారంభమవుతుందనగా పాక్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాక్ జట్టులో సీనియర్ ప్లేయర్లలో ఒకడైన షోయబ్ మాలిక్ జట్టుకు దూరమయ్యాడు. అతడు జట్టుకు పదిరోజుల పాటు దూరం కానున్నట్లు పాకిస్ధాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 

వ్యక్తిగత సమస్య కారణంగానే మాలిక్ జట్టుకు దూనమైనట్లు పిసిబి తెలిపింది. పది రోజుల పాటు అతడు పాకిస్ధాన్  లోనే వుండి తన సమస్యలను పరిష్కరించుకుని తిరిగి ఇంగ్లాండ్ కు వస్తాడని వివరించారు.  ఈ మేరకు అతడు జట్టునే కాదు ఇంగ్లాండ్ ను కూడా వీడనున్నట్లు తెలిపారు. ఇప్పటికి జట్టుతో పాటు ఇంగ్లాండ్ కు చేరుకున్న మాలిక్ ను పాకిస్ధాన్ కు తిరిగి వెళ్లేందుకు అనుమతిచ్చినట్లు పిసిబి ఓ ప్రకటనలో వెల్లడించింది. 

పదిరోజుల పాటు అతడు జట్టుకు దూరమవనున్నాడంటే మే5 న కార్డిఫ్ లో జరిగే ఏకైక టీ20 ఆడే అవకాశాలు లేవన్నమాట. అంతేకాకుండా  ఐదు వన్డే సీరిస్ లో భాగంగా మే8న లండన్ లో జరగనున్న మొదటి వన్డేను కూడా మిస్సవనున్నాడు. మళ్లీ మే11వ తేదీన సౌంతాప్టన్ లో జరగనున్న రెండో వన్డేకు అందుబాటులోకి వస్తాడన్నమాట. 

ప్రపంచ కప్ కు ముందు తమ జట్టు చేపట్టిన ఇంగ్లాండ్ పర్యటన తమకెంతో ఉపయోగపడుతుందని పాకిస్థాన్ జట్టు మేనేజ్ మెంట్ భావిస్తోంది. ప్రపంచ కప్ కూడా ఇవే పిచ్ లపై జరుగుతుండటంతో పిచ్ పరిస్ధితులతో పాటు ఇంగ్లాండ్ లోని వాతావరణ పరిస్థితులకు తమ ఆటగాళ్లు అలవాటు పడతారని అనుకుంది. కానీ ఇలా సీనియర్ ఆటగాడు రెండు మ్యాచుల్లో ఆ అవకాశాన్ని కోల్పోతుండటం కాస్త ఆందోళనకు గురిచేస్తున్నట్లు కనిపిస్తోంది.