Asianet News TeluguAsianet News Telugu

Shoaib Akhtar: తెరకెక్కనున్న రావల్పిండి ఎక్స్‌ప్రెస్ జీవితం.. సినిమా అనౌన్స్ చేసిన పాక్ దిగ్గజం

Rawalpindi Express: పాకిస్తాన్ స్పీడ్‌స్టర్,  అభిమానులంతా రావల్పిండి ఎక్స్‌ప్రెస్ అని పిలుచుకునే షోయభ్ అక్తర్ జీవితం వెండితెరకెక్కనుంది. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. 

Shoaib Akhtar Announces His Biopic on Social Media, Movie Name Titled as Rawalpindi Express
Author
India, First Published Jul 25, 2022, 2:29 PM IST | Last Updated Jul 25, 2022, 2:29 PM IST

సుమారు 15 ఏండ్లపాటు ప్రపంచ దిగ్గజ బ్యాటర్లకు తన ‘పేస్’ రుచి చూపించిన పాకిస్తాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ షోయభ్ అక్తర్ జీవితం ఇక వెండితెరకు ఎక్కనుంది. పాకిస్తాన్ లోని రావల్పిండికి చెందిన ఈ  స్టార్ పేసర్ జీవితానికి సంబంధించిన సినిమాను కూడా  అతడు ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ అని పెట్టుకున్నాడు. గత కొంతకాలంగా క్రికెటర్ల బయోపిక్‌ (ఎంఎస్ ధోని, సచిన్, శభాష్ మిథూ, ప్రవీణ్ తాంబే)ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో తాజాగా అక్తర్ కూడా తన బయోపిక్‌ను అనౌన్స్ చేశాడు. 

రావల్పిండి నుంచి వచ్చిన అక్తర్  తన కథ, ప్రయాణాన్ని ప్రపంచానికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు.  ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ అనేది సినిమా పేరుకాగా  రన్నింగ్ అగేనెస్ట్ ది ఆడ్స్ అనేది ట్యాగ్ లైన్. 

సోషల్ మీడియా వేదికగా అక్తర్ స్పందిస్తూ.. ‘ఈ అందమైన ప్రయాణానికి ప్రారంభం.  నా కథ, నా జీవితానికి సంబంధించి తెరకెక్కబోతున్న నా బయోపిక్ ను అనౌన్స్ చేస్తున్నాను.  సినిమా పేరు ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్-రన్నింగ్ అగేనెస్ట్ ది ఆడ్స్ (అసమానతలకు వ్యతిరేకంగా నా పరుగు) మీరు ఇంతవరకు వెళ్లని రైడ్ కు మీరు వెళ్లనున్నారు. పాకిస్తాన్ క్రీడాకారునికి సంబంధించి తొలి విదేశీ చిత్రం.. వివాదాస్పదంగా అది నీదే.. షోయభ్ అక్తర్’ అని తన ట్విటర్ వేదికగా రాసుకొచ్చాడు. 

 

ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను అక్తర్ తన ట్విటర్ ఖాతాలో పంచుకుంటూ పై విధంగా స్పందించాడు. ప్రస్తుతం పట్టాలెక్కుతున్న దశలో ఉన్న ఈ సినిమా 2023, నవంబర్ 16న అన్ని ప్రధాన స్టేషన్ల (థియేటర్లు) లలో హాల్ట్ కానున్నది.

అయితే ఈ సినిమాకు కథ, కథనం, నటీనటులు, ఎవరన్న విషయాన్ని మాత్రం అక్తర్ వెల్లడించలేదు. మహ్మద్ ఫరాజ్ కైజర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ‘పాకిస్తాన్ కు చెందిన క్రీడాకారుని తొలి విదేశీ చిత్రం’ అన్నాడు కాబట్టి ఈ సినిమా భారత్ లో రిలీజ్ అవుతుందా..? లేదా..? అనేది కూడా తేలాల్సి ఉంది. మరి తన వేగాన్ని, అటిట్యూడ్ ను ప్రపంచ క్రికెట్ అభిమానులకు చూపెట్టిన అక్తర్.. సినిమాలో ఏం చూపించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా  ట్యాగ్ లైన్ (అసమానతలకు వ్యతిరేకంగా నా పరుగు) చూస్తే మాత్రం ఇది అతడి జీవితంలోని కష్టాలు, పాకిస్తాన్  కు ఆడటం, వివాదాల వంటి దశలను ప్రపంచానికి పరిచయం చేసేదనే విషయం మాత్రం అర్థమవుతున్నది. మరి అక్తర్ తన రావల్పిండి ఎక్స్‌ప్రెస్ లో ఏం చెబుతాడో చూడాలంటే వచ్చే ఏడాది నవంబర్ వరకు వేచి చూడాల్సిందే. 

1997లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన అక్తర్.. 2011 వరకు ఆడాడు. తన కెరీర్ లో 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20లు ఆడిన అతడు.. టెస్టులలో 178, వన్డేలలో 247, టీ20లలో 19 వికెట్లు పడగొట్టాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios