దాయాది దేశాలైన ఇండియా-పాకిస్థాన్ ల మధ్య గతకొన్నేళ్లుగా జమ్మూ కశ్మీర్ విషయంలో వివాదం చెలరేగుతోంది. అయితే ఈ మధ్యకాలంలో అది మరింత ఎక్కువయ్యింది. జమ్మూ కశ్మీర్ స్వయంప్రతిపత్తిని తొలగిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ‘కశ్మీర్ అవర్’ పేరుతో పాకిస్థాన్ ప్రజలు నిరసనలకు సిద్దమయ్యారు. అయితే ఇలా కశ్మీర్ ప్రజలకు మద్దతుగా తమ ప్రభుత్వం చేపడుతున్న నిరసన కార్యక్రమంలో తాను పాలుపంచుకుంటానని మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ప్రకటించాడు.

''పాక్ ప్రదాని ఇమ్రాన్ ఖాన్ ''కశ్మీర్ అవర్'' పిలుపును నేను స్వాగతిస్తున్నా. ఆయన సూచన మేరకు  ఓ పాకిస్ధానీ పౌరుడిగా కశ్మీరీలకు మద్దతుగా నిలవాలనుకుంటున్నా. అందుకోసమే ఆగస్ట్ 30  శుక్రవారం మజర్  ఈ క్వాద్ లో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొంటా. అలాగే సెప్టెంబర్ 6వ తేదీన షాహిదీల(అమరవీరుల) ఇళ్లను సందర్శిస్తాను. అతి త్వరలో ఎల్వోసీలో కూడా పర్యటిస్తా.'' అంటూ షాహిద్ అఫ్రిది ట్వీట్ చేశాడు.  

 అఫ్రిది ట్విట్టర్ ద్వారా ఈ ప్రకటన చేసిన  కొద్ది గంటల్లోనే బిజెపి ఎంపి, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ దీనిపై స్పందించాడు. '' కొందరు వ్యక్తులు ఎప్పటికి ఎదగలేరు. వారు శరీరం పెరిగివుండొచ్చు కానీ మెదడు అస్సలు ఎదగలేదు. నిజంగానే ప్రతి  విషయంతో పాలిటిక్స్ చేయాలనుకుంటే నేరుగా రాజకీయాల్లోకి రావచ్చు. కానీ రాజకీయ నాయకుడికి మెచూరిటీ అవసరం...వారికది  లేదు కదా. '' అంటూ షాహిద్ అఫ్రిదిపై గంభీర్ విరుచుకుపడ్డాడు. 

కశ్మీరీ ప్రజలకు సంఘీభావంగా ప్రతి శుక్రవారం ‘కశ్మీర్ అవర్’ పేరిట  ఓ కార్యక్రమం చేపట్టనున్నట్లు పాక్ ప్రధాని ఇటీవల ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 30నుండి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఓ సైరన్ మోగుతుంది. దీంతో ప్రజలందరు స్వచ్చందంగా నిరసనలో పాల్గొని కశ్మీరీ ప్రజలకు మేమున్నామన్న భరోసా ఇవ్వాలని ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ వివరించారు.