KRG-MLC Stadium Near Los Angles: అమెరికా లోని దక్షిణ కాలిఫోర్నియా రాష్ట్రంలో త్వరలోనే ఓ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. యూఎస్ఏలో క్రికెట్ వ్యాప్తి ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న తరుణంలో బాలీవుడ్ బాద్షా అటుదిశగా అడుగులు వేస్తున్నాడు.
బాలీవుడ్ బాద్షా, ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్ అమెరికాలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మిచబోతున్నారా...? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. యూఎస్ఎలోని మేజర్ లీగ్ క్రికెట్ టీ20 (ఎంఎల్సీ) తో కలిసి షారుఖ్ ఖాన్ కు చెందిన నైట్ రైడర్స్ గ్రూప్ (కేఆర్జీ) లు దక్షిణ కాలిఫోర్నియాలోని ఇర్వైన్ సిటీలో భారీ వ్యయంతో క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయని కథనాలు వెలువడుతున్నాయి. క్రిక్ బజ్ నివేదిక ప్రకారం... లాస్ ఏంజెల్స్ కు 40 మైళ్ల దూరంలో ఉన్న సౌత్ కాలిఫోర్నియా లో గల ఇర్వైన్ నగరంలో సుమారు పదివేల మంది సీటింగ్ కెపాజిటీ తో క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు కేఆర్జీ-ఎంఎల్సీ ల మధ్య అవగాహన కుదిరినట్టు సమాచారం.
యూఎస్ఎలో 2023లో ఓ భారీ క్రికెట్ లీగ్ ను నిర్వహించేందుకు ఎంఎల్సీ సిద్ధమవుతున్నది. దాని తర్వాత కూడా అమెరికాలో విరివిగా క్రికెట్ వ్యాప్తి కోసం కృషి చేసేందుకు సన్నాహాకాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుమారు 25 నుంచి 30 యూఎస్ మిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ స్టేడియాన్ని నిర్మిచేందుకు కేఆర్జీ-ఎంఎల్సీ ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలుస్తున్నది.
ఇర్వైన్ నగరంలోని 15 ఎకరాల స్థలంలో ఈ స్టేడియం నిర్మాణం సాగనున్నది. రాబోయే రోజుల్లో అమెరికాలో క్రికెట్ వ్యాప్తి తో పాటు 2024 లో ఐసీసీ నిర్వహించబోయే టీ20 ప్రపంచకప్ కు కూడా వెస్టిండీస్ తో కలిపి యూఎస్ఎ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఇప్పటికే డల్లాస్, సాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్, నార్త్ కరోలినా వంటి ప్రాంతాల్లో క్రికెట్ ప్టేడియాలు నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
దీంతో పాటే షారుక్ ఖాన్ నిర్మిచంబోయే ఈ స్టేడియం కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని చూస్తున్నారు. ఒకవేళ టీ20 ప్రపంచకప్ వరకు ప్టేడియం నిర్మాణం పూర్తైతే.. 2028లో ఒలింపిక్స్ (లాస్ ఏంజెల్స్) లో క్రికెట్ ప్రవేశపెట్టాలని చూస్తున్నఐసీసీ ఆశలకు అనుగుణంగా ఇర్వైన్ లో క్రికెట్ మ్యాచులను ఆడించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు.
ఇదే విషయమై షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘అమెరికాలో రాబోయే కాలంలో క్రికెట్ వ్యాప్తి పెరుగుతుందనే నమ్మకంతోనే ఎంఎల్సీతో కలిసి పెట్టుబడులు పెడుతున్నాం. ఈ ప్రయత్నం వల్ల మా నైట్ రైడర్స్ కు అంతర్జాతీయ బ్రాండ్ కూడా ఏర్పడుతుంది. లాస్ ఏంజెల్స్ కు సమీపంలో ఎంఎల్సీ తో కలిసి అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియాన్ని నిర్మించాలని భావిస్తున్నాం. ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైన మెట్రో పాలిటన్ సిటీలో క్రికెట్ డెస్టినేషన్ గా మారుతుందని ఆశిస్తున్నాం..’ అని తెలిపాడు.
