అబుదాబి: మహారాష్ట్రకు చెందిన 23ఏళ్ల యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ పై సీనియర్ క్రికెటర్ డుప్లెసిస్ ప్రశంసలు కురిపించారు. చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ లో మొట్టమొదటి సారి ప్లేఆఫ్ కు చేరకపోయినా మరీ చెత్తగా టోర్నీ నుండి నిష్క్రమించకుండా చివర్లో రుతురాజ్ అద్భుత విజయాలను అందించాడు. ఈ క్రమంలోనే రుతురాజ్ ఆటతీరు చూస్తుంటే యువ విరాట్ కోహ్లీలా కనిపిస్తున్నాడంటూ డుప్లెసిస్ ప్రశంసించాడు. 

ఐపిఎల్ ఆరంభంలో కరోనా బారినపడ్డ రుతురాజ్ ఆలస్యంగా బరిలోకి దిగాడు. అయితే అతడు ఆడిన మొదటి మూడు మ్యాచులు ఒకెత్తయితే మిగతా మూడు మ్యాచులు మరోఎత్తు. ఐపిఎల్ లో ఆడిన మొదటి మ్యాచ్ లోనే డకౌటయి అభిమానులను తీవ్ర నిరాశపర్చాడు రుతురాజ్. ఆ తర్వాత కూడా ఓ మ్యాచ్ లో 5 పరుగులు మాత్రమే చేశాడు. ఇక మూడో మ్యాచ్ లో మళ్లీ డకౌటయ్యాడు. దీంతో అతడిపై అభిమానులు నమ్మకాన్ని కోల్పోయారు. 

read more  ఈ మాత్రం స్పార్క్ సరిపోతుందా ధోనీ... ‘తలైవా’ని ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్...

అయితే చెన్నై యాజమాన్యం మాత్రం అతడికి మరో అవకాశాన్నిచ్చింది. అప్పటికే ప్లేఆఫ్ రేసునుండి తప్పకున్న ధోని సేన గౌరవప్రదంగా టోర్నీ నుండి నిష్క్రమించాలన్న పట్టుదలతో వుంది. ఈ సమయంలో బరిలోకి దిగిన రుతురాజ్ తన సత్తా ఏంటో చూపించాడు. 65 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

ఇదేదో గాలివాటం ఇన్నింగ్స్ అయివుంటుందని అనుకున్న అభిమానులకు ఆ తర్వాతి మ్యాచ్ లో 72 పరుగులతో సమాధానమిచ్చాడు. ఇక ఆదివారం పంజాబ్ తో జరిగిన చివరి మ్యాచ్ లో 62 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టుకు మరపురాని గెలుపును అందించాడు రుతురాజ్. అందువల్లే డుప్లెసిస్ అతన్ని కోహ్లీతో పోల్చినా ఎవ్వరూ ట్రోల్ చేయడానికి సాహసించడం లేదు. దీన్ని బట్టే అభిమానులు కూడా రుతురాజ్ లో యువ కోహ్లీని చూసుకుంటున్నారని అర్థమవుతోంది. 

చెన్నై ఆడిన చివరి మూడు మ్యాచుల్లోనూ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన రుతురాజ్ చెన్నై జట్టు తరఫున అత్యధిక సగటుతో సీజన్‌ను ముగించడం విశేషం.  మ్యాచ్‌ చివరి వరకు క్రీజ్‌లో ఉండి ఎలా గెలిపించాలో రుతురాజ్ చూపించాడంటూ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ మెచ్చుకున్నాడు.