టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా ఫైనల్ ఆడేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అనుమతి ఇవ్వలేదని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు జయదేవ్ షా తెలిపారు. రాజ్‌కోట్ వేదికగా ఈ నెల 9 నుంచి సౌరాష్ట్ర, బెంగాల్ జట్లు తుదిపోరులో తలపడనున్నాయి.

జడేజాను సౌరాష్ట్ర తరపున ఆడించాలని భావించిన జయదేవ్.. దాదా అనుమతి కోరారు. అయితే త్వరలో టీమిండియా దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉండటంతో గంగూలీ నిరాకరించారు. రంజీ ట్రోఫీ కంటే దేశమే ముఖ్యమని దాదా వ్యాఖ్యానించారు.

Also Read:మరోసారి రెచ్చిపోయిన హార్దిక్ పాండ్యా: 55 బంతుల్లో 158 పరుగులు, శ్రేయస్ రికార్డు బ్రేక్

అయితే దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జయదేవ్.. బీసీసీఐ తీరుపై మండిపడ్డారు. రంజీ ట్రోఫీ లాంటి మ్యాచ్‌లకు ప్రేక్షకుల నుంచి ఆదరణ రావాలంటే, ఈ  మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించొద్దని ఆయన సూచించారు.

అదే బోర్డు ఐపీఎల్ సమయంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించగలదా అని జయదేవ్ ప్రశ్నించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వల్ల ఆదాయం వస్తుందని బోర్డు ఖచ్చితంగా అలా చేయదన్నారు.

టీమిండియా స్టార్ ఆటగాళ్లు కనీసం రంజీ ఫైనల్స్‌లో ఆడినా వాటికి ఆదరణ పెరుగుతుందని, ఈ విషయాన్ని కాస్త ఆలోచించాలన్నాడు. రంజీ ఫైనల్స్‌లో జడేజా పాల్గొంటే బాగుండేదని, అతనితో పాటు బెంగాల్‌ తరపున మహమ్మద్ షమీ ఆడినా తనకు ఇష్టమేనని జయదేవ్ తెలిపారు.

Also Read:39 బంతుల్లో 105 పరుగులు: రెచ్చిపోయిన హార్దిక్ పాండ్యా

అయితే బెంగాల్, సౌరాష్ట్రల మధ్య తుదిపోరుకు టీమిండియా టెస్ట్ క్రికెటర్లు ఛతేశ్వర్ పుజారా, వృద్ధిమాన్ సాహా ఆడనున్నారు. పుజారా సౌరాష్ట్ర తరపున, సాహా బెంగాల్ తరపున బరిలోకి దిగనున్నారు.