ఆగస్టు 6న జమ్ము కశ్మీర్‌లోని వధువు ఇంట్లో ఘనంగా జరిగిన సర్ఫరాజ్ ఖాన్ వివాహం... శుభాకాంక్షలు తెలిపిన క్రిస్ గేల్, సూర్యకుమార్ యాదవ్ అండ్ కో...
రంజీ క్రికెట్‌లో రికార్డుల వర్షం కురిపిస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ వివాహం చేసుకున్నాడు. 25 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ వివాహ వేడుక, కశ్మీర్‌లో అతి కొద్ది మంది బంధుమిత్రుల మధ్య ఘనంగా జరిగింది. జమ్ము కశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో ఆగస్టు 6న వధువు ఇంట్లో సర్ఫరాజ్ ఖాన్ వివాహం జరిగింది..
అయితే సర్ఫరాజ్ ఖాన్ పెళ్లి చేసుకున్న యువతి పేరు కూడా బయటికి రాకపోవడం విశేషం. ‘అల్లా దయవల్ల పెళ్లి అయిపోయింది’ అంటూ వివాహ వేడుకకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు సర్ఫరాజ్ ఖాన్. ఈ ఫోటోలపై సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ‘క్యా బాత్ హై... (లవ్ సింబల్) బహుత్ బహుత్ బడాయి... (చాలా పెద్ద వాడివి అయిపోయావ్’ అంటూ కామెంట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్.
ఈ ముంబై బ్యాటర్‌తో కలిసి ఐపీఎల్ ఆడిన వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్, ఉమ్రాన్ మాలిక్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, మన్‌దీప్ సింగ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, సికందర్ రజా, రాహుల్ చాహార్, ఆవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్, రమేశ్ పవార్, తబ్రీజ్ షంసీ, అభిషేక్ పోరెల్, హర్షిత్ రాణా, సమర్థ్ వ్యాస్, జయంత్ యాదవ్, ప్రియాంక్ పంచల్ వంటి క్రికెటర్లు, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సర్ఫరాజ్ ఖాన్‌కి కామెంట్లతో వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
25 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్, 39 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 79.65 సగటుతో 3559 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ 5 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ సగటు విషయంలో ది గ్రేట్ డాన్ బ్రాడ్‌మెన్ తర్వాతి స్థానంలో ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌ని సెలక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు.
రంజీ ట్రోఫీలో గత మూడు సీజన్లలో రికార్డు లెవెల్లో పరుగులు సాధించాడు సర్ఫరాజ్ ఖాన్. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో సర్ఫరాజ్ ఖాన్‌కి అవకాశం దక్కుతుందని అంతా అనుకున్నారు. అయితే అలా జరగలేదు. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కి చోటు దక్కనుందని వార్తలు వచ్చాయి. అయితే ఆ సిరీస్‌లోనూ సర్ఫరాజ్ ఖాన్‌ని పట్టించుకోలేదు సెలక్టర్లు..
దేశవాళీ టోర్నీల్లో బాగా ఆడుతున్నా సర్ఫరాజ్ ఖాన్‌ని పట్టించుకోకపోవడానికి అతని ఫిట్‌నెస్సే కారణమని వార్తలు వినిపించాయి. అయితే ఫిట్‌నెస్ కంటే ఎక్కువగా అతని యాటిట్యూడ్, బిహేవియర్ కారణంగానే సెలక్టర్లు, సర్ఫరాజ్ ఖాన్‌ని పట్టించుకోవడం లేవని కూడా కథనాలు వైరల్ అయ్యాయి..
వచ్చే డిసెంబర్ వరకూ టీమిండియా, టెస్టు ఫార్మాట్ ఆడడం లేదు. డిసెంబర్‌లో సౌతాఫ్రికా పర్యటనలో రెండు టెస్టులు ఆడనుంది టీమిండియా. ఈ సిరీస్‌కి కూడా సర్ఫరాజ్ ఖాన్‌కి చోటు దక్కడం అనుమానమే. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి టీమ్స్‌కి ఆడిన సర్ఫరాజ్ ఖాన్ సరైన అవకాశాలు రాలేదు. వచ్చిన ఒకటి రెండు అవకాశాలను సర్ఫరాజ్ ఖాన్ సరిగ్గా వాడుకోలేకపోయాడు.
