కరాచీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ విషయంలో బిసిసిఐ వ్యవహరించిన తీరను పాకిస్తాన్ క్రికెటర్ సక్లెయిన్ ముస్తాక్ తప్పు పట్టారు. ధోనీ విషయంలో బిసీసీసీఐ సరైన రీతిలో వ్యవహరించలేదని ఆయన అన్నారు.  వీడ్కోలు మ్యాచ్ లేకుండా ధోనీ రిటైర్ అయ్యారని, అది సరి కాదని పాకిస్తాన్ స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ అన్నారు. 

వీడ్కోలు ఘనంగా ఉండాలని ప్రతి క్రికెటర్ కోరుకుంటాడని, భారత జెర్సీతో ఎంఎస్ ధోనీ కనిపిస్తే చివరిసారి చూడాలని ధోనీ అభిమానులు కోరుకుంటారని ఆయన అన్నారు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఎంఎస్ ధోనీ ఆగస్టు 15వ తేదీన ఇన్ స్టాగ్రాంలో పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. 

ధోనీని అభిమానించేవాళ్లందరికీ ఆ ఫిర్యాదు  ఉంటుందని, చివరి సారి ధోనీ గ్లోవ్స్ పెట్టుకుని వికెట్ కీపింగ్ చేస్తుంటే, బ్యాటింగ్ చేస్తుంటే చివరిసారి చూడాలని ఉంటుందని, అలా చేసి ఉంటే గొప్పగా ఉండేదని ఆయన అన్నారు. తన యూట్యూబ్ చానెల్ లో సక్లెయిన్ ముస్తాక్ ఆ వ్యాఖ్యలు చేశారు. 

తన చానెల్ లో వ్యతిరేకంగా ఏదీ ఉండదని, అలా చేయాలని అనుకున్నప్పుడు ఆలోచించి, వెనక్కి తగ్గుతానని, కానీ ధోనీ విషయంలో ఆ విషయం చెప్పాలని తన మనసు చెప్పిందని ఆయన అన్నారు. అంతటి గొప్ప ఆటగాడి పట్ల బిసిసిఐ వ్యవహరించిన తీరు బాగా లేదని అన్నారు. "ధోనీ... నువ్వు జెమ్, రియిల్ హీరో, నీ గురించి నేను గర్విస్తున్నాను" అని సక్లెయిన్ ముస్తాక్ అన్నారు.