మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఆఖరి బంతిని అద్భుతంగా డ్రైవ్ చేస్తూ ఆపిన సంజూ శాంసన్... 3 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకున్న భారత జట్టు...
ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఇరుజట్లు కూడా ఒక్కటంటే ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా పూర్తిగా 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయలేకపోయాయి. అయితే వెస్టిండీస్ పర్యటనలో మొదటి వన్డే మ్యాచ్, పూర్తిగా 100 ఓవర్ల పాటు సాగింది...
తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లు బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేస్తూ... ఆ లక్ష్యఛేదనలో చివరి బంతి వరకూ పోరాడిన వెస్టిండీస్, 3 పరుగు తేడాతో పరాజయం ఎదుర్కొంది. 16 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన వెస్టిండీస్‌ను కేల్ మేయర్స్, షమర్ బ్రూక్స్ కలిసి రెండో వికెట్‌కి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆదుకున్నారు...
75 పరుగులు చేసిన కేల్ మేయర్స్, 46 పరుగులు చేసిన షమర్ బ్రూక్స్ అవుట్ కావడంతో 200 పరుగుల లోపే 5 వికెట్లు కోల్పోయింది వెస్టిండీస్. అయితే బ్రెండన్ కింగ్ 54, అకీల్ హుస్సేన్ 32, రొమారియో షెఫర్డ్ 39 పరుగులతో రాణించడంతో ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది మ్యాచ్...
ఆఖరి ఓవర్‌లో వెస్టిండీస్ విజయానికి 15 పరుగులు కావాల్సి రాగా తొలి బంతికి పరుగులేమీ ఇవ్వలేదు మహ్మద్ సిరాజ్. రెండు బంతికి సింగిల్ రాగా, మూడో బంతికి ఫోర్ బాదాడు రొమారియో షెఫర్డ్. నాలుగో బంతికి 2 పరుగులు రాగా, ఆ తర్వాతి బంతి వైడ్‌గా వెళ్లింది...
ఐదో బంతికి 2 పరుగులు రావడంతో ఆఖరి బంతికి 6 కొడితే వెస్టిండీస్ గెలిచేది. ఫోర్ బాది మ్యాచ్ టైగా మారి, సూపర్ ఓవర్‌కి దారి తీసేది. అయితే ఆఖరి బంతికి అద్భుతమైన వైడ్ యార్కర్ వేసిన మహ్మద్ సిరాజ్, రొమారియో షిఫర్డ్‌కి బౌండరీ బాదేందుకు అవకాశం ఇవ్వలేదు...
సిరాజ్ మియ్యా వేసిన యార్కర్‌ని వికెట్ల వెనకాల అద్భుతంగా డైవ్ చేస్తూ ఒడిసి పట్టుకున్నాడు సంజూ శాంసన్. లేదంటే ఆ బంతి బౌండరీకి వెళ్లి, వెస్టిండీస్‌కి బైస్ రూపంలో 4 పరుగులు వచ్చి ఉండేవి. బ్యాటుతో పెద్దగా రాణించకపోయినా థ్రిల్లింగ్ మూమెంట్‌లో బంతిని ఒడిసిపట్టుకున్న సంజూ శాంసన్... భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు...
10 ఓవర్లలో 57 పరుగులిచ్చి మహ్మద్ సిరాజ్, 2 కీలక వికెట్లు తీసి అదరగొట్టాడు. శార్దూల్ ఠాకూర్ 8 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసి 54 పరుగులు ఇవ్వగా ప్రసిద్ధ్ కృష్ణ 10 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 62 పరుగులు సమర్పించాడు...
యజ్వేంద్ర చాహాల్ 10 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా దీపక్ హుడా 5 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు. శార్దూల్ ఠాకూర్ ఖాతాలో మరో 2 ఓవర్లు మిగిలి ఉన్నా ఆఖరి ఓవర్‌ని సిరాజ్‌కి ఇచ్చిన శిఖర్ ధావన్, కావాల్సిన రిజల్ట్ రాబట్టగలిగాడు..
