న్యూఢిల్లీ: హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ధోనీని చూస్తే తన భర్త షోయబ్ మాలిక్ గుర్తుకు వస్తాడట. తన భర్త షోయబ్ మాలిక్ వ్యక్తిత్వాన్ని ధోనీ వ్యక్తిత్వం గుర్తు చేస్తుందని ఆమె అన్నారు. 

ఆ విషయాన్ని ఆమె ఫేస్ బుక్ లైవ్ సెషన్ లో చెప్పారు. ధోనీ ప్రవర్తన ప్రతిసారీ తన భర్తను గుర్తు చేస్తుందని, ఇద్దరూ చాలా కూల్ గానూ సరదానూ ఉంటారని ఆమె అన్నారు. ధోనీ ఓ లెజెండ్ అని, తన ఆల్ టైమ్ ఫేవరైట్ ఆటగాళ్లలో ధోనీకి ప్రత్యేకమైన స్థానం ఉంటుందని సానియా అన్నారు. 

ధోనీ రిటైర్మెంట్ మీద కూడా సానియా స్పందించారు. ధోనీ కోరుకుంటే ఆయన కోసం తప్పకుిండా ఫేర్ వెల్ మ్యాచ్ నిర్వహించాలని ఆమె అన్నారు. అయితే ధోనీ మైదానంలో తన ప్రదర్శనపై తప్ప గొప్ప వీడ్కోలుపై ఆశ పెట్టుకోడని సానియా అన్నారు. 

ఎంఎస్ ధోనీ ఇటీవల తాను అంతర్జాతీయ క్రికట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అనూహ్యంగా ధోనీ తన రిటైర్మెంట్ విషయాన్ని తెలియజేశాడు. ప్రస్తుతం ఆయన ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.