Asianet News TeluguAsianet News Telugu

Pakistan Vs Bangladesh: ఉత్కంఠ పోరులో పాకిస్థాన్ దే విజయం.. సాజిద్ ఖాన్ కు 12 వికెట్లు.. 2-0తో సిరీస్ కైవసం

Pakistan Vs Bangladesh: టీ20 ప్రపంచకప్ సెమీస్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన  పాకిస్థాన్ కు అద్భుత విజయం దక్కింది. టీ20 సిరీస్ తో పాటు ఆ జట్టు టెస్టు సిరీస్ ను కూడా చేజిక్కించుకుంది. 

Sajid Khan Shines With Ball as Pakistan Win Second Test against Bangladesh by an Innings 8 Runs
Author
Hyderabad, First Published Dec 8, 2021, 5:40 PM IST

బంగ్లాదేశ్ పర్యటనను పాకిస్థాన్ విజయంతో ముగించింది. టీ20 ప్రపంచకప్ లో అద్భుతమైన ప్రదర్శనతో సెమీస్ కు చేరిన ఆ జట్టు.. ఆ తర్వాత బంగ్లా టూర్ కు వచ్చింది.  ఆ దేశంతో టీ20  సిరీస్ గెలిచిన బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాక్ జట్టు.. తాజాగా రెండు టెస్టుల సిరీస్ ను 2-0తో చేజిక్కించుకుంది. బంగ్లాను ఫాలో ఆన్ ఆడించిన పాక్.. ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో ఓడించింది. పాక్ స్పిన్నర్ ఈ టెస్టులో ఏకంగా 12 వికెట్లు పడగొట్టాడు.  తొలి టెస్టులో సెంచరీతో పాటు రెండు టెస్టుల్లో నిలకడగా రాణించిన ఆ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ అబిద్ అలీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. 

వర్షం కారణంగా సుమారు రెండు రోజుల ఆట వర్షార్పణం కాగా.. ఆఖరు రోజు ఉత్కంఠగా జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ అద్భుతంగా పోరాడింది. ఢాకా వేదికగా జరిగిన  టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసి.. 300 పరుగులు చేసిన పాక్.. బంగ్లాను తొలి ఇన్నింగ్స్ లో 87 పరుగులకే ఆలౌట్ చేసిన విషయం తెలిసిందే. అదే క్రమంలో ఆ జట్టును ఫాలో ఆన్ ఆడించిన  పాక్.. రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాను 205 పరుగులకే కట్టడి చేసింది.

 

తొలి ఇన్నింగ్స్ లో 213 పరుగులు వెనుకబడి ఫాలో ఆన్ ఆడిన బంగ్లాదేశ్.. రెండో ఇన్నింగ్స్ లో కూడా చేతులెత్తేసింది. షాహీన్ అఫ్రిది, సాజిద్ ఖాన్ ల దెబ్బకు ఆ జట్టు బ్యాటర్లు  క్రీజులో నిలవడానికే ఇబ్బంది పడ్డారు.  బంగ్లా వెటరన్ ఆల్ రౌండర్ షకిబ్ ఉల్ హసన్ (63) ఒక్కడే కాస్త ప్రతిఘటించాడు. అతడికి వికెట్ కీపర్ లిటన్ దాస్ (45), ముష్ఫీకర్ రహీమ్ (43) కాసేపు సహకారం అందించారు. బంగ్లా తొలి ఇన్నింగ్స్ లో కూడా షకిబ్, శాంటో లు మాత్రమే రాణించారు. వాళ్లిద్దరూ తప్ప మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు.  సాజిద్ దెబ్బకు ఏకంగా ఐదుగురు డకౌట్ అయ్యారు. 

తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టిన సాజిద్ ఖాన్.. రెండో ఇన్నింగ్స్ లో లిటన్ దాస్, షకీబ్, తైజుల్ ఇస్లాం, ఖలీల్ అహ్మద్ లను పెవిలియన్ కు పంపి ఆ జట్టు పరాజయాన్ని శాసించాడు. దీంతో ఈ టెస్టులో అతడిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. తొలి టెస్టులో కూడా పాకిస్థాన్.. 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించిన విషయం తెలిసిందే. 

 

తాజా విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్  పాయింట్ల పట్టికలో పాకిస్థాన్.. భారత్ ను అధిగమించింది.  కానీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో మాత్రం భారత్ అగ్రస్థానంలో ఉండగా.. పాక్ ఐదో స్థానంలో ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios