బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో టీమిండియాకి స్పిన్ బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే... నెట్ బౌలర్లుగా ఆరుగురు స్పిన్నర్లు, టీమ్‌లో మరో నలుగురు స్పిన్నర్లు..
విదేశాల్లో జరిగే టెస్టుల్లో టీమిండియా ప్రధాన బలం ఫాస్ట్ బౌలర్లే. అదే స్వదేశానికి వచ్చేసరికి స్పిన్నర్లే హీరోలుగా మారతారు. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ స్పిన్ బౌలింగే ప్రధాన బలంగా బరిలో దిగుతోంది భారత జట్టు...
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన సిరీస్ కావడంతో స్పిన్ పిచ్‌లు తయారుచేసి, ఆస్ట్రేలియాకి చుక్కలు చూపించాలని అనుకుంటోంది భారత జట్టు. ఆస్ట్రేలియా కూడా స్పిన్ బౌలింగ్‌తోనే టీమిండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. ఇప్పటికే ఆసీస్ స్పిన్నర్లను ఎదుర్కోవడానికి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ కో...
భారత జట్టులో రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా స్పిన్నర్లుగా ఉన్నారు. వీరితో పాటు వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, రాహుల్ చాహార్, ఆర్ సాయి కిషోర్ నెట్ బౌలర్లుగా సేవలు అందిస్తున్నారు...
అదనంగా జయంత్ యాదవ్, పుల్‌కిత్ నారంగ్‌లను కూడా నెట్ బౌలర్లుగా చేరుస్తూ నాగ్‌పూర్‌కి పంపించింది బీసీసీఐ. ఏకంగా ఆరుగురు నెట్ స్పిన్నర్లతో ప్రాక్టీస్ చేస్తోంది భారత జట్టు. తాజాగా స్పిన్నర్లకు కోచింగ్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కోచ్‌ని నియమించింది బీసీసీఐ...
ముంబై లెగ్ స్పిన్నర్, మాజీ టీమిండియా క్రికెటర్ సాయిరాజ్ బహుతులే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో టీమిండియాకి స్పిన్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు. టీమిండియా తరుపున 2 టెస్టులు, 8 వన్డేలు ఆడిన సాయిరాజ్ బహుతులే, 188 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి 630 వికెట్లు తీశాడు...
ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 6176 పరుగులు కూడా చేసిన సాయిరాజ్, ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. గత నవంబర్‌లో జరిగిన న్యూజిలాండ్ టూర్‌లో టీమిండియాకి స్పిన్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన సాయిరాజ్ బహుతులే... ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగిసే వరకూ భారత జట్టుకి సేవలు అందించబోతున్నాడు..
రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు మరో ఇద్దరు స్పిన్నర్లను తుది జట్టులో ఆడించబోతున్నట్టు టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ప్రకటించాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లలో ఏ ఇద్దరు తుది జట్టులోకి వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై టీమిండియా కెప్టెన్ ఎలాంటి హింట్ ఇవ్వలేదు...
పిచ్ స్పిన్‌కి అనుకూలించే విధంగానే ఉంటుందని కామెంట్ చేశాడు రోహిత్. ఆస్ట్రేలియా టీమ్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఎక్కువగా ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పిచ్‌ని తడపకుండా స్పిన్ పిచ్‌గా తయారుచేశారు క్యూరేటర్లు...
ఆస్ట్రేలియా కూడా స్పిన్ బౌలింగ్‌పైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. సీనియర్ స్పిన్నర్ నాథన్ లయన్‌తో పాటు అస్టన్ అగర్, మిచెల్ స్వీప్సన్, టాడ్ ముర్ఫీ రూపంలో ఒకరికి నలుగురు స్పిన్నర్లు... బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకున్నారు... వీరిలో టాడ్ ముర్ఫీ, నాగ్‌పూర్ టెస్టులో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేయబోతున్నాడని సమాచారం...
ఫింగర్ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్న టాడ్ ముర్ఫీ, భారత బ్యాటర్లను ఇబ్బంది పెడతాడని భావిస్తోంది ఆస్ట్రేలియా.
