వెస్టిండీస్ గడ్డపై టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో వన్డేలో భారత్ పేలవమైన ప్రదర్శనను ఇచ్చింది.
వెస్టిండీస్ గడ్డపై టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో వన్డేలో భారత్ పేలవమైన ప్రదర్శనను ఇచ్చింది. ఈ వన్డేలో 6 వికెట్ల తేడా విజయం సాధించిన వెస్టిండీస్.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అయితే వెస్టిండీస్ వారి గడ్డపై భారత్‌ను ఓడించడం ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి. భారత్‌తో జరిగిన చివరి పది వన్డేల్లో వెస్టిండీస్‌కు ఇదే తొలి విజయం. అయితే ఐసీసీ వన్డే వరల్డ్ కప్2023కి ఇంకా మూడు నెలల కంటే తక్కువ సమయం ఉన్నందున.. ఈ ఓటమిపై భారత క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు విశ్రాంతి ఇవ్వడం.. మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు తడబడటంతో.. ఫలితంగా ఈ మ్యాచ్‌లో ప్రయోగాలపై చాలా మంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విండీస్‌తో రెండో వన్డేలో టీమిండియా ఓటమి తర్వాత పలువురు భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే చాలా మంది టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. కొందరు రాహుల్ ద్రావిడ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ద్రావిడ్ సారథ్యంలో భారత్ ఒక్క పెద్ద టోర్నీని కూడా గెలవలేకపోయిందని.. అతడి ప్రయోగాలు వల్ల టీమిండియాకు లాభాల కంటే నష్టమే ఎక్కువని ఆరోపణలు చేస్తున్నారు. #SackDravid హ్యాష్ ట్యాగ్‌తో పోస్టులు చేస్తున్నారు.
‘‘సచిన్ 194 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఇప్పుడు కోహ్లి రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్నప్పుడు అతనికి విశ్రాంతి ఇస్తున్నారు. అనేక సమస్యలు.. ఒకటే పరిష్కారం.. ద్రావిడ్‌ను తొలగించండి’’ అని ఓ నెటిజన్ కోరారు.
ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన ద్రావిడ్.. ఆసియా కప్, ఆ తర్వాత వరల్డ్ కప్‌కు వెళ్లే ముందు వెస్టిండీస్ సిరీస్ తమకు ఈ ప్రయోగాలను చేయడానికి చివరి అవకాశంగా ఉపయోగపడిందని వివరించాడు. గాయపడిన ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తిరిగి రావడం గురించి అనిశ్చితి కారణంగా.. వారిని వారు మ్యాచ్ సిద్ధంగా ఉంచుకోవడానికి బ్యాకప్ ఎంపికలకు కొంత సమయం ఇవ్వవలసి ఉంటుందని అన్నారు.
ఇక, శనివారం జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగగా.. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (34), ఇషాన్ కిషన్ (55) తొలి వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే గిల్ నిష్క్రమించడంతో.. టీమిండియా ఇన్నింగ్స్ తడబడింది. తర్వాత టీమిండియా ఆటగాళ్లు.. ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాట పట్టారు. సంజూ శాంసన్ 19 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేశారు. అక్షర్ పటేల్ కూడా రాణించలేకపోయాడు, కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. హార్దిక్ పాండ్యా 7 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో కేవలం 23 పరుగుల మాత్రమే చేయగలిగాడు. చివరకు భారత్ కేవలం 40.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది.
అయితే ఓ మోస్తరు లక్ష్య చేధనలో విండీస్‌కు ఓపెనర్లు బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్ శుభారంభం అందించారు. షాయ్ హోప్ అజేయంగా 63 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో విండీస్ లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. కీసీ కార్తీ కూడా 48 పరుగులతో దూకుడుగా ఆడాడు. ఇక, ఈ వన్డే సిరీస్‌ను నిర్ణయించే మూడో మ్యాచ్ ఆగస్టు 1న ట్రినిడాడ్‌లో జరగనుంది.
