వరల్డ్ కప్ విజేతలకు సచిన్ చేతుల మీదుగా సత్కారం.. బీసీసీఐ కీలక ప్రకటన
Under-19 Women's World Cup 2023: ఇటీవలే దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన ఐసీసీ అండర్ - 19 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో ఇంగ్లాండ్ ను ఓడించిన భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

ఐసీసీ తొలిసారి నిర్వహించిన అండర్ - 19 మహిళల టీ20 ప్రపంచకప్ ను భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. షెఫాలీ వర్మ సారథ్యంలోని యువ భారత్.. రెండ్రోజుల క్రితమే ఫైనల్ లో ఇంగ్లాండ్ ను ఓడించి ట్రోఫీ నెగ్గింది. మహిళల క్రికెట్ లో భారత్ కు ఇదే తొలి ఐసీసీ ట్రోఫీ. దేశానికి గర్వకారణంగా నిలిచిన అమ్మాయిలను సత్కరించడానికి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్ లో అభిమానులు దేవుడిగా కొలిచే సచిన్ టెండూల్కర్ తో అమ్మాయిలకు సత్కారం చేయనుంది.
ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా వెల్లడించాడు. జై షా తన ట్వీట్ లో.. ‘అండర్-19 మహిళల ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యులకు సచిన్ టెండూల్కర్ తో పాటు బీసీసీఐ ఆఫీస్ బేరర్స్ ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం ఉంటుంది...’ అని పేర్కొన్నాడు.
భారత్ - న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి1న జరుగబోయే మూడో టీ20 ఇందుకు వేదిక కానుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు సచిన్, బీసీసీఐ.. అండర్ - 19 వరల్డ్ కప్ గెలిచిన అమ్మాయిలను సత్కరిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఈ కార్యక్రమం ఉండనుందని జై షా పేర్కొన్నాడు.
ప్రపంచకప్ గెలిచిన షెఫాలీ సేన.. నేడు దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి రానుంది. ఆ తర్వాత రేపు (బుధవారం) బీసీసీఐ సత్కారం ముగిసిన తర్వాత క్రికెటర్లు వారి సొంత ఇంటికి బయల్దేరతారు. ఇక అండర్ - 19 ప్రపంచకప్ ఫైనల్ లో తొలుత ఇంగ్లాండ్ ను 17.1 ఓవర్లలో 68 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా.. తర్వాత లక్ష్యాన్ని 14 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కాగా ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టు, కోచింగ్ సిబ్బందికి బీసీసీఐ రూ. 5 కోట్ల నగదు బహుమతి ప్రకటించిన విషయం తెలిసిందే.