మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, ఏడేళ్లు పూర్తయ్యింది. సచిన్ రిటైర్మెంట్ రోజున విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీతో పాటు చాలామంది ఎన్నో విలువైన బహుమతులను తమ జ్ఞాపకంగా టెండూల్కర్‌కి అందించారు.

సచిన్‌కి ఏడేళ్ల క్రితం వెండీస్ లెజెండరీ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా, ‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్ ఇచ్చిన బహుమతిని ఇన్నాళ్లకు అభిమానుల ముందుకి తెచ్చాడు మాస్టర్. లారా, క్రిస్ గేల్ కలిసి తనకి ఈ డ్రమ్స్ ఇచ్చారని చెప్పిన సచిన్ టెండూల్కర్, వారికి కృతజ్ఞతలు తెలిపారు.

రిటైర్మెంట్ తర్వాత ఓ సారి టెండూల్కర్ ఇంటికి వచ్చిన బ్రియాన్ లారా... అద్భుతంగా డ్రమ్స్ వాయించాడట. తాను కూడా ప్రయత్నిస్తానని చెప్పిన సచిన్, కాసేపు డ్రమ్స్ వాయించాడు. లారా రేంజ్‌లో వాయించలేకపోయానని చెప్పినా, సచిన్ డ్రమ్స్ కొట్టిన విధానానికి ఫిదా అయిన క్రిస్ గేల్ ‘మాస్టర్’ అంటూ కామెంట్ చేశాడు.