జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గల్లీ క్రికెట్ ఆడారు. బాలీవుడ్ స్టార్లు వరుణ్ ధవన్, అభిషేక్ బచ్చన్ తో కలిసి ఆయన క్రికెట్ ఆడారు.
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత క్రికెట్ లెజెండ్ ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాడు. బాలీవుడ్ స్టార్లు వరుణ్ ధవన్, అభిషేక్ బచ్చన్ లతో కలిసి కాస్సేపు సరదాగా గల్లీ క్రికెట్ ఆడారు. ఇలా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ''పిట్ ఇండియా మూమెంట్'' కు సచిన్ మద్దతుగా నిలిచాడు. కేవలం తానే కాదు బాలీవుడ్ హీరోలను కూడా ఇందులో భాగస్వామ్యం చేసి దేశంలో క్రీడాభివృద్ది కోసం తనవంతు సాయం చేశాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మెహబూబా స్టూడియోలో ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నాడు. అదే స్టూడియోలో బాలీవుడ్ హీరోలు వరుణ్ ధవన్, అభిషేక్ బచ్చలు ఓ సినిమా షూటింగ్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సచిన్ తన కార్యక్రమాన్ని ముగించుకుని వారిని కలవడానికి షూటింగ్ స్పాట్ కు వెళ్లాడు.
అలా షూటింగ్ స్పాట్ లోనే వారంతాకలిసి కాస్సేపు క్రికెట్ ఆడారు. మొదట సచిన్ బ్యాటింగ్ చేయగా ధవన్, బచ్చన్ లు బౌలింగ్ చేశారు. ఆ తర్వాత వారిద్దరు బ్యాటింగ్ చేయగా సచిన్ ప్రోత్సాహంతో జియా అనే మహిళా యువ క్రికెటర్ బౌలింగ్ చేసింది. ఇలా హీరోలిద్దరితో సరదాగా ఆడిన గల్లీ క్రికెట్ వీడియోను సచిన్ తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
'' పనిని, క్రీడలను కలపడం మంచిదే. అలా వరుణ్ ధవన్, అభిషేక్ బచ్చన్ లతో కలిసి షూటింగ్ స్పాట్ లో క్రికెట్ ఆడటం చాలా సరదాగా అనిపించింది.'' అంటూ సచిన్ వీడియోను అభిమానులతో పంచుుకున్నాడు. జాతీయ క్రీడా దినోత్సవం రోజున ఇలా క్రీడలను ప్రమోట్ చేయడమే కాకుండా ప్రధాని ప్రకటించిన ఫిట్ ఇండియా ఉద్యమానికి కూడా ప్రచారం కల్పించాడు.
ఇక సచిన్ తో కలిసి ఆడటం గురించి హీరో వరుణ్ ధవన్ కూడా స్పందించాడు. '' క్రీడా దినోత్సవం సందర్భంగా గొప్ప చొరవ చూపారు సర్. మీతో కలిసి పరుగెత్తడం ఎంతో సరదానిచ్చింది.'' అంటూ ధవన్ ట్వీట్ చేశాడు.
