ఈ రోజు భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 47వ పుట్టినరోజు. అయితే ఈ సందర్భంగా ఆయనకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా పలువురు క్రికెట్ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

క్రికెట్ ఆటపై అభిరుచి ఉన్న వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పాజీ ఈ ఏడాది మీకు అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నా అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా సచిన్‌తో కలిసి ఉన్న ఫోటోను విరాట్ షేర్ చేశాడు.

మరో దిగ్గజ క్రికెటర్, భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా క్రికెట్ దేవుడికి విషెస్ తెలియజేశాడు. ‘ఇది ఒక నిజం, ఒక గొప్ప వ్యక్తి బ్యాటింగ్ చేస్తూ భారత్‌లో సమయాన్ని ఆపగలిగేవాడు.

అయితే, సచిన్ కెరీర్‌లో అతిపెద్ద స్ఫూర్తి ఏదైనా ఉందంటే అది ఈ రెండు చిత్రాల్లోనే దాగి ఉంది. ప్రతీ కష్టం వెనుక ఓ విజయం ఉంటుంది. ఇలాంటి విపత్కర పరిస్ధితుల్లో దీనిని తప్పకుండా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని సెహ్వాగ్ అన్నాడు.

2013లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన టెండూల్కర్ తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను బద్ధలు కొట్టాడు. క్రికెట్ చరిత్రలో అన్ని ఫార్మాట్లలో  కలిపి 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు ఆయనే. అలాగే వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడు సచినే.

24 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు ఎనలేని సేవలందించాడు. 200 టెస్టుల్లో 15,291 పరుగులు, 463 వన్డేల్లో 18,426 పరుగులు చేసి మరెవ్వరూ అందుకోలేని రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.