క్రికెట్‌ ప్రపంచంపై కరోనా ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కరోనా లాక్‌డౌన్ కారణంగా ఏడు నెలల పాటు క్రికెట్‌కి బ్రేక్ పడగా... తాజాగా మరోసారి అంతర్జాతీయ క్రికెట్‌పై కరోనా ప్రభావం చూపుతోంది. న్యూజిలాండ్ చేరిన పాక్ క్రికెటర్లలో 10 మందికి కరోనా సోకగా... తాజాగా సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య జరిగాల్సిన వన్డే మ్యాచ్ కరోనా కారణంగా వాయిదా పడింది.

సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య నేడు మొదటి వన్డే మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే సౌతాఫ్రికా క్రికెట్ జట్టులో ఒక ప్లేయర్‌కి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో మ్యాచ్ ప్రారంభం కాకముందే వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కేప్‌టౌన్‌లో జరగాల్సిన వన్డే మ్యాచ్‌ను పార్ల్‌కి మార్చారు.

మిగిలిన క్రికెటర్లకు కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాత డిసెంబర్ 6న ఆదివారం మొదటి వన్డే జరగనుంది. ఆ తర్వాతి రోజే కేప్‌టౌన్‌లో రెండో వన్డే జరుగుతుందని ప్రకటించింది క్రికెట్ సౌతాఫ్రికా.