Asianet News TeluguAsianet News Telugu

Ruturaj Gaikwad: అవి సెంచరీలా.. మంచి నీళ్లా? అలా చేస్తున్నాడేంటి? ఇలా చేస్తే సెలెక్టర్లకు కష్టమే..

Vijay Hazare Trophy 2021: ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో సూపర్ ఫామ్ తో రెచ్చిపోయిన సీఎస్కే ఓపెనర్ గైక్వాడ్.. ఫామ్ ను కొనసాగిస్తూ దుమ్ము రేపుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటికే 3 సెంచరీలు చేసిన ఈ మహారాష్ట్ర కెప్టెన్.. ఇప్పుడు మరో శతకం బాదాడు. 

Ruturaj Gaikwad Scores 5th century In Vijay Hazare trophy, levels Virat kohli s Record
Author
Hyderabad, First Published Dec 14, 2021, 6:47 PM IST

దక్షిణాఫ్రికా వన్డే జట్టు  కోసం ఎవరిని ఎంపిక చేయాలనే విషయం మీద భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తర్జన భర్జన పడుతున్నది. విజయ్ హజారే ట్రోఫీ   తర్వాత వన్డే జట్టును ఎంపిక చేయడానికి కసరత్తులు చేస్తున్నది. ఈ ట్రోఫీ పై ఓ కన్నేసిన బీసీసీఐకి మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్.. వేరే ఆప్షన్ లేకుండా ఆడుతున్నాడు. ఈ ట్రోఫీలో రుతురాజ్ గైక్వాడ్ దుమ్ము రేపుతున్నాడు.  ఇటీవలే ముగిసిన  ఐపీఎల్ ఫామ్ ను కొనసాగిస్తూ.. భీకర బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఈ ట్రోఫీలో 3 సెంచరీలు చేసిన ఈ యువ ఆటగాడు.. తాజాగా  మరో సెంచరీ బాది టీమిండియా టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. 

మహారాష్ట్రకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రుతురాజ్.. ఈ ట్రోఫీలో మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు బాదుతున్నాడు. ఇప్పటివరకు  ఈ ట్రోఫీలో మహారాష్ట్ర తరఫున ఐదు మ్యాచులు ఆడిన గైక్వాడ్.. నాలుగు సెంచరీలు బాదడం విశేషం. అంతేగాక  ఒకే సీజన్ లో నాలుగు సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ,  దేవదత్ పడిక్కల్, పృథ్వీ షా ల సరసన చేరాడు. 2008-09లో విరాట్ కోహ్లీ, 2020-21 లో దేవదత్ పడిక్కల్, 2020-21 లో పృథ్వీ షా లు ఈ రికార్డు సాధించారు.

 

విజయ్ హాజారే ట్రోపీలో భాగంగా తొలి మ్యాచులో మధ్యప్రదేశ్ పై 136 పరుగులు చేసిన రుతురాజ్..  ఆ తర్వాత వరుసగా ఛత్తీస్ గఢ్ పై 154 నాటౌట్, కేరళ పై 124  బాదాడు. తాజాగా చండీగఢ్ తో మంగళవారం జరిగిన మ్యాచ్ లో కూడా 132 బంతుల్లోనే 168 పరుగులు చేశాడు.  ఇందులో 12 ఫోర్లు, 6 సిక్సర్లున్నాయి. 

తాజా సెంచరీతో రుతురాజ్ ఈ ట్రోఫీలో పలు రికార్డులను బద్దలు కొట్టాడు.   ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో 500 పరుగులు సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. మొత్తంగా ఇప్పటివరకు గైక్వాడ్.. 5  మ్యాచులలోనే 603 పరుగులు సాధించి  అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగాఉన్నాడు. బ్యాటింగ్ యావరేజీ ఏకంగా 150.75 గా ఉంది.  

 

గైక్వాడ్ తాజా ప్రదర్శనతో అతడిని టీమిండియా వన్డే జట్టుకు ఎంపిక చేయాల్సిందేనని ఫ్యాన్స్ బీసీసీఐని కోరుతున్నారు. ఇదే విషయమై  రెండ్రోజుల క్రితం మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దేశవాళీ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లో భీకరమైన ఫామ్ లో ఉన్న గైక్వాడ్ ను ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంపిక చేస్తారని ప్రశ్నించిన విషయం తెలిసిందే. మరి బీసీసీఐ పెద్దలు రుతురాజ్ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి. 

ఇక  మహారాష్ట్ర-చండీగఢ్  మ్యాచ్ విషయానికొస్తే.. గైక్వాడ్ సేన మరో విజయాన్ని అందుకుంది.  తొలుత బ్యాటింగ్ చేసిన చండీగఢ్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 309 పరుగులు చేసింది.  ఆ జట్టు కెప్టెన్ మనన్ వోహ్రా (141) సెంచరీతో ఆకట్టుకోగా.. అర్స్లాన్ ఖాన్ (87), అంకిత్ (56) రాణించారు. అనంతరం ఛేదనలో మహారాష్ట్ర.. 48.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. రుతురాజ్ తో పాటు అజిమ్ కాజీ (73) మెరవడంతో  మహారాష్ట్రకు మరో విజయం దక్కింది. 

Follow Us:
Download App:
  • android
  • ios