రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ.. 40 పరుగులు చేసిన సంజూ శాంసన్, 38 పరుగులు చేసిన రింకూ సింగ్.. 22 పరుగులు చేసిన శివమ్ దూబే..

వెస్టిండీస్ టూర్‌లో అదరగొట్టి, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియాకి టూ డౌన్ ప్లేయర్ అవుతాడనుకున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ... ఐర్లాండ్ టూర్‌లో ఇబ్బంది పడుతున్నాడు. తొలి టీ20లో గోల్డెన్ డకౌట్ అయిన తిలక్ వర్మ, రెండో టీ20లో 1 పరుగు చేసి రెండో బంతికే అవుట్ అయ్యాడు. అయితే రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ, సంజూ శాంసన్ మెరుపులతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 185 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది..

మార్క్ అదైర్ వేసిన తొలి ఓవర్‌లో 2 పరుగులు మాత్రమే వచ్చాయి. రెండో ఓవర్‌లో 4, 6 బాదిన యశస్వి జైస్వాల్ స్కోరు బోర్డును కదిలించాడు. 11 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, విల్ యంగ్ బౌలింగ్‌లో కాంపర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన తిలక్ వర్మ, మొదటి బంతికి సింగిల్ తీసి రెండో బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. జోషువా లిటిల్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో 4, 4, 4, 6 బాదిన సంజూ శాంసన్ 18 పరుగులు రాబట్టాడు. 26 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేసిన సంజూ శాంసన్, బెంజమిన్ వైట్ బౌలింగ్‌లో వికెట్లపైకి షాట్ ఆడి అవుట్ అయ్యాడు..

మరో ఎండ్‌లో ఇన్నింగ్స్ నిర్మించడానికి సమయం తీసుకున్న రుతురాజ్ గైక్వాడ్, 39 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 43 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 58 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్.. బరీ మెక్‌కార్తీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ అవుటైన తర్వాత మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన శివమ్ దూబే, అంతర్జాతీయ క్రికెట్‌లో మొదటిసారి బ్యాటింగ్‌కి వచ్చిన రింకూ సింగ్ బౌండరీలు బాదడానికి తెగ కష్టపడ్డారు...

డెత్ ఓవర్లలో 3 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా సాధించలేకపోయింది భారత జట్టు. బారీ మెక్‌కార్తీ వేసిన 19వ ఓవర్‌లో 4, 6,6 బాదిన రింకూ సింగ్ 22 పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్‌లో మొదటి 2 బంతుల్లో 2 భారీ సిక్సర్లు బాదాడు శివమ్ దూబే. నాలుగో బంతికి సిక్సర్ బాదిన రింకూ సింగ్, ఆ తర్వాతి బంతికి కూడా భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు..

21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసిన రింకూ సింగ్, మార్క్ అదైర్ బౌలింగ్‌లో విల్ యంగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. శివమ్ దూబే 16 బంతుల్లో 2 సిక్సర్లతో 22 పరుగులతో నాటౌట్‌గా నిలవగా ఆఖరి బంతిని ఫేస్ చేసిన వాషింగ్టన్ సుందర్ లెగ్ బైస్ రూపంలో ఓ పరుగు రాబట్టాడు. 16-18 మధ్య 3 ఓవర్లలో 14 పరుగులే చేసిన టీమిండియా, ఆఖరి 2 ఓవర్లలో 42 పరుగులు రాబట్టింది.