ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 షెడ్యూల్‌ వచ్చేసింది. ఆరంభ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 19 ఖరారు కాగా.. అంతిమ సమరం నవంబర్‌ 8 లేదా 10పై పీటముడి కొనసాగుతోంది. కరోనా వైరస్‌ మహమ్మారి ఐపీఎల్‌ నిర్వహణకు ఎన్నో లాజిస్టికల్‌ ప్రశ్నలను లేవనెత్తింది. ప్రత్యేకించి ప్రాంఛైజీలు సమాధానం దొరకని ప్రశ్నలను ఎదుర్కొంటున్నాయి. 

ఐపీఎల్ కోసం యూఏఈ ని వేదికగా ఖరారు చేసిన విషయం తెలిసిందే. భారత్ లో కరోనా కేసులు విపరీతంగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భారత్ నుంచి వేదికను యూఏఈ కి మార్చారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దుబాయ్ లో సైతం కేసులు పెరుగుతున్నాయి. 

దుబాయ్‌లో జరగాల్సిన వరల్డ్‌ రగ్బీ 7 టోర్నీ రద్దు అయ్యింది. దుబాయిలో రోజుకు 350-400 కరోనా వైరస్‌ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో.... అక్కడ వరల్డ్‌ రగ్బీ సెవెన్‌ సిరీస్‌ నిర్వహించటం సురక్షితం కాదని వరల్డ్‌ రగ్బీ సంఘం టోర్నీని రద్దు చేసింది. 

మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో దుబాయి సురక్షిత ప్రదేశమని బీసీసీఐ పదేపదే చెబుతోంది. ఈ విషయం పై మాట్లాడుతూ.... 'అవును, రగ్బీ టోర్నీ రద్దు అయిన సంగతి మాకు తెలుసు. ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డుతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. ఐపీఎల్‌ 2020కి దుబాయి అత్యంత సురక్షిత ప్రదేశమని ఈసీబి హామీ ఇస్తోంది' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

రగ్బీ టోర్నీకి సురక్షితం కానీ దుబాయి, క్రికెట్ కి ఎలా సురక్షితమో ఇక్కడ అంతుచిక్కని విషయం. అంతే కాకుండా కరోనా కేసులు విపరీతంగా మున్ముందు పెరగనున్నాయని అంటున్నారు. దుబాయిలో పర్యాటకులను సైతం అనుమతుయించనున్నారు. ఈ నేపథ్యంలో దుబాయిలో కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని మరికొందరు అంటున్నారు. 

ఇకపోతే... దుబాయి, షార్జా, అబుదాబి స్టేడియాలు ఐపీఎల్‌2020కి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. యుఏఈలో క్రికెట్‌ మ్యాచులకు ఫిక్సింగ్‌ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గతంలో బీసీసీఐ పేర్కొనగా.. ఇప్పుడు అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్‌ అజిత్‌ సింగ్‌ భిన్నమైన అభిప్రాయం వెల్లడించాడు. 

2013లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో దావూద్ గ్యాంగ్ కి చెందిన సభ్యులు కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. వారంతా దుబాయ్ నుండే ఈ తతంగాన్ని నడిపించారు. అప్పుడు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారో అందరికి తెలిసిన అంశమే. ఆ దెబ్బకు ఏకంగా రెండు జెట్లే నిషేధాన్ని ఎదుర్కొన్నాయి.