Royal Challengers Bangalore Players podcast: మెగావేలం నిర్వహించబోతున్న బెంగళూరు నగరంలో తమ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చింది ఆర్సీబీ.. తాజాగా ఆ జట్టు ఆటగాళ్లతో..
ఐపీఎల్-15 సీజన్ కు ముందు బెంగళూరు వేదికగా నిర్వహించబోయే మెగా వేలానికి ఆ నగరపు జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సిద్ధమైంది. ఇందులో భాగంగానే తమ పాత జట్టులోని పలువుర సభ్యులతో ఓ పాడ్కాస్ట్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఇందులో ఆ జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లి, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, దేవదత్ పడిక్కల్, గ్లెన్ మ్యాక్స్వెల్ వంటి ఆటగాళ్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆర్సీబీ, బెంగళూరు నగరంతో తమకున్న అనుబంధాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు.
ముందుగా విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ తరఫున ఎంపికైనప్పుడు నేను అండర్-19 ప్రపంచకప్ (2008) కోసం మలేషియా లో ఉన్నాను. నా అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేసిన రోజు నాకింకా గుర్తుంది. ఒకవేళ నేను ఇండియాకు ఆడకపోతే నేను ఏమంత సంపాదిస్తాననే విషయం కూడా నాకు అప్పుడే తెలిసింది.
కానీ వేలంలో నాకు అంత ధర పలకడం చూసి నాకు క్రేజీగా అనిపించింది..’ అని తెలిపాడు. 2008 ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ.. కోహ్లిని రూ. 12 లక్షలకు దక్కించుకుంది. ఇప్పుడు కోహ్లి ఏడాది వేతనం రూ. 15 కోట్లు.. 2013 సీజన్ నుంచి కోహ్లి.. గత సీజన్ దాకా ఆర్సీబీ సారథిగా కూడా వ్యవహరించాడు.
మిస్టర్ 360 స్పందిస్తూ.. ‘ఆర్సీబీతో నా అనుబంధం ప్రత్యేకమైనది. నేను మిగతా ఏ ఫ్రాంచైజీతో ఉన్నా ఇంత అనుబంధం ఉండేదని నేను భావించను. ఈ నగరం, ఇక్కడి ప్రజలు నాపై చూపించిన ప్రేమ మాటల్లో చెప్పలేనిది..’ అని అన్నాడు. ఈ సందర్బంగా అభిమానులు.. ఏబీడీ ని బెంగళూరులోనే ఉండిపోమ్మంటూ సందేశాలు పంపారని అక్కడే ఉన్న యాంకర్ ప్రశ్నించగా అతడు స్పందిస్తూ.. ‘నాకు ముగ్గురు పిల్లలు. నేను ఉండాలంటే చాలా పెద్ద అపార్ట్మెంట్ కావాలి..’ అని ఫన్నీ గా సమాధానమిచ్చాడు.
ఇక టీమిండియా నయా పేస్ సంచలనం సిరాజ్ మాట్లాడుతూ... ‘ఐపీఎల్ కు ఎంపికైన తర్వాత నేను కొన్ని వస్తువులు కొనుక్కున్నాను. మొదటగా నేను ఐఫోన్ 7 ప్లస్ కొన్నాను. ఆ తర్వాత ఓ సెకండ్ హ్యాండ్ కార్ (టయోటా కంపెనీకి చెందిన కరోలా) తీసుకున్నాను. ఐపీఎల్ ఆడేవాల్లకు కారు ఉండాలి కదా.. ఎంతకాలం ప్లాటినా (సిరాజ్ బైక్) మీద తిరుగుతాను. అందుకే కార్ కొన్నా. కానీ నాకు డ్రైవింగ్ రాదు. దాంతో నా అంకుల్ వాళ్ల కొడుకును నాతో పాటు డ్రైవింగ్ కు తీసుకెళ్లేవాడిని. నా కారులో ఏసీ కూడా ఉండేది కాదు. అందుకే బయటకు వెళ్తే కారు అద్దాలు తెరిచే ఉంచేవాడిని. దాంతో అభిమానులు నన్ను గుర్తు పట్టి చీర్ చేసేవాళ్లు.. అది ఎంతో సంతోషంగా అనిపించేది.. ఆ తర్వాత ఏడాది మెర్సిడిస్ కొనుక్కున్నాను..’ అని తెలిపాడు.
నా జీవితాన్ని మార్చింది : గ్లెన్ మ్యాక్స్వెల్
గ్లెన్ మ్యాక్స్వెల్ స్పందిస్తూ.. ‘ఐపీఎల్ నా జీవితాన్ని అద్భుతమైన రీతిలో మార్చింది. నేను నా జీవితంలో అభిమానించే వారిని, హీరోలుగా ఆరాధించేవారిని ఇక్కడ కలుసుకోగలిగాను. ఐపీఎల్ నన్ను పరిపూర్ణ క్రికెటర్ గా మార్చింది. భారత్, ఇక్కడి సంస్కృతి గురించి ఒక యువ ఆటగాడిగా నాకు అంత అవగాహన లేదు. కానీ నేను కలిసిన వ్యక్తులు, ఐపీఎల్ నుంచి నేను నేర్చుకున్న విషయాలు ఒక క్రికెటర్ గానే గాక వ్యక్తిగా నాకు ఎంతో తోడ్పడ్డాయి...’అని మ్యాక్సీ చెప్పాడు.
ఐపీఎల్-15 వేలానికి ముందు రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా.. ఆర్సీబీ విరాట్ కోహ్లి (రూ. 15 కోట్లు), గ్లెన్ మ్యాక్స్వెల్ (రూ. 11 కోట్లు), సిరాజ్ (రూ. 7 కోట్లు) ను దక్కించుకున్న విషయం తెలిసిందే.
