రొమేనియా: తమిళనాడుకు చెందిన శివకుమార్ దూకుడుతో అంతర్జాతీయ ట్వంటీ20 క్రికెట్ లో రొమేనియా ప్రపంచ రికార్డును సృష్టించింది. రొమేనియా కప్ 2019లో భాగంగా టర్కీతో జరిగిన మ్యాచులో రొమేనియా ఆ రికార్డు సాధించింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన రొమేనియా ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టర్కీ 13 ఓవర్లలో 53 పరుగులకే చేతులెత్తేసింది. ఫలితంగా రొమేనియా 173 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా రొమేనియా చరిత్ర సృష్టించింది.

శ్రీలంక జట్టు పేరు మీద గత 12 ఏళ్లుగా ఉన్న రికార్డును రొమేనియా బద్దలు కొట్టింది. రొమేనియా ఆటగాళ్లలో శివకుమార్ పెరియాల్వార్ బ్యాట్ తో విరుచుకుపడ్డాడు. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోయాడు. 40 బంతుల్లోనే 105 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 

శివకుమార్ భారతీయుడే కావడం విశేషం. 31 ఏళ్ల ఆయన తమిళనాడుకు చెందినవాడు. చిన్నప్పటి నుంచి వివిధ దశల్లో క్రికెట్ ఆడదాడు. చదువు ముగిసిన తర్వాత రొమేనియా వెళ్లి సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా స్థిరపడ్డాడు. అక్కడ కూడా తన అద్భుతమైన ఆటతో జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు.

రొమేనియా అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా తొలి స్థానం సంపాదించగా, ఆ తర్వాతి స్థానాల్లో శ్రీలంక (172), పాకిస్తాన్ (143), భారత్ (143), ఇంగ్లాండు (137) జట్లు ఉన్నాయి.