Asianet News TeluguAsianet News Telugu

రోహిత్ అన్ ఫిట్.. ఐదో టెస్టుకు సారథిగా బుమ్రా..? అరుదైన ఘనత సాధించబోతున్న పేస్ గుర్రం

IND vs ENG 5th Test: ఇంగ్లాండ్ తో ఎడ్జబాస్టన్ వేదికగా మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానున్న ఐదో టెస్టుకు రోహిత్ శర్మ దూరమయ్యాడు. అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా  భారత జట్టును నడిపించనున్నాడని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే అతడు  టీమిండియా దిగ్గజ సారథి కపిల్ దేవ్ సరసన నిలవనున్నాడు. 

Rohit Sharma Ruled Out, Jasprit Bumrah to Lead Team India in Edgbaston Test, Reports
Author
India, First Published Jun 29, 2022, 7:04 PM IST

గతేడాది కరోనా కారణంగా మిగిలిపోయిన టెస్టును ఆడేందుకు ఇంగ్లాండ్ కు వచ్చిన టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.  లీస్టర్షైర్ తో  ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుండగా  గత ఆదివారం కరోనా బారిన పడ్డ  భారత జట్టు సారథి రోహిత్ శర్మ.. ఐదో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. అతడింకా కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకోలేదు.  దీంతో ఈ టెస్టులో అతడికి విశ్రాంతినిచ్చింది టీమ్ మేనేజ్మెంట్. రోహిత్  స్థానాన్ని టీమిండియా పేస్ గుర్రం  జస్ప్రీత్ బుమ్రా భర్తీ చేయనున్నాడని సమాచారం.  

ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ANIలో వచ్చిన సమాచారం మేరకు ఎడ్జబాస్టన్ టెస్టులో భారత జట్టుకు జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించనున్నాడు. ఈ మేరకు టీమ్ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని బుమ్రా కు తెలియజేసింది. శుక్రవారం టెస్టు ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో బుధవారం కీలక సమావేశం నిర్వహించింది జట్టు యాజమాన్యం.  

ఈ సమావేశంలో రోహిత్ ఆరోగ్యంపై ప్రధానంగా చర్చ జరిగింది. అయితే అతడు ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో  ఐదో టెస్టులో భారత జట్టు పగ్గాలు బుమ్రాకు అందజేయాలని  జట్టు యాజమాన్యం తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.  రిషభ్ పంత్, విరాట్ కోహ్లి ల పేర్లు కూడా పరిగణనలోకి వచ్చినా బీసీసీఐ మాత్రం బుమ్రా వైపునకే మొగ్గు చూపినట్టు  సమాచారం. 

 

ఈ వార్తలు నిజమైతే గనక బుమ్రా అరుదైన ఘనత సాధించినట్టే. భారత దిగ్గజ ఆటగాడు, టీమిండియాకు తొలి వన్డే ప్రపంచకప్ అందించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తర్వాత మళ్లీ భారత జట్టుకు ఒక పేసర్  సారథ్యం వహించిన దాఖలాల్లేవ్.   ఎడ్జబాస్టన్ టెస్టులో బుమ్రా సారథిగా ఉంటే  కపిల్ దేవ్ తర్వాత ఆ ఘనత సాధించిన తొలి బౌలర్ గా బుమ్రా చరిత్ర పుటల్లోకెక్కుతాడు. 

ఇక రోహిత్  శర్మ కు కరోనా సోకడంతో అతడి రిప్లేస్మెంట్ గా వచ్చిన మయాంక్ అగర్వాల్ ఇప్పటికే జట్టుతో చేరాడు. అయితే తుది జట్టులో ఎవరెవరుంటారనేదానిపై ఇంకా స్పష్టత లేదు. కానీ చివరి టెస్టుకు రోహిత్ లేకపోవడం టీమిండియాకు పెద్ద లోటు కిందే లెక్క. గతేడాది జరిగిన నాలుగు టెస్టులలో రోహిత్ ఓ సెంచరీతో పాటు 368 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక అతడు వచ్చిన తొలి విదేశీ పర్యటన ఇది. కానీ ఈ టెస్టులో కూడా రోహిత్ అందుబాటులో లేకపోవడం  గమనార్హం. హిట్ మ్యాన్ కెప్టెన్ అయ్యాక అతడు ఆడని రెండు టీ20లలో, 3 వన్డేలలో టీమిండియా ఓడింది. మరి టెస్టులలో భారత జట్టు ఎలా ముందుకెళ్తుందనేది ఇప్పుడు ఆసక్తికరం. 

Follow Us:
Download App:
  • android
  • ios