ఐపిఎల్ 12 సీజన్ మొత్తంలో జరిగిన అన్ని మ్యాచులు ఒకెత్తయితే...ఫైనల్ మ్యాచ్ ఒక్కటి మరోఎత్తు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ముగిసి మూడు రోజులు గడుస్తున్న ఇంకా దానిపై చర్చ కొనసాగుతూనే వుంది. సమఉజ్జీల మధ్య జరిగిన ఈ పోరులో  అనూహ్యమైన మలుపులు, అనుమానాస్పద సంఘటనలు, అంపైర్ల తప్పిదాలపై చర్చ జరుగుతోంది. వీటన్నింటికంటే మ్యాచ్ గతిని మలుపు తిప్పిన మలింగ ఫైనల్ ఓవర్ పై అభిమానుల మధ్యే కాదు మాజీలు,క్రికెట్ విశ్లేషకుల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. 

అయితే మలింగతో ఇలా చివరి ఓవర్ వేయించడానికి గల కారణాలపై రోహిత్ శర్మ మరోసారి స్పందిచాడు. అప్పటికే  మూడు ఓవర్లపాటు బౌలింగ్ చేసిన మలింగ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అయినా అతడితోనే కీలమైన చివరి ఓవర్ వేయించాలన్న  తన ప్రయోగానికి చాలా కారణాలున్నాయని రోహిత్  తెలిపాడు. 

''ఇప్పుడు ఫలితం వచ్చింది కాబట్టి అతా బాగానే అనిపిస్తోంది. కానీ చెన్నైని ఆరు బంతుల్లో 9 పరుగులు చేయకుండా అడ్డుకోవాల్సిన సమయంలో మాత్రం నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. అయితే ఈ సమయంలో నేను అనుభవాన్నే నమ్ముకున్నాను. ప్రస్తుతం  ముంబై జట్టులో ఇలాంటి క్లిష్ట సమయంలో బౌలింగ్ చేసిన అనుభవం ఎవరికుందా అని ఆలోచించా. అప్పుడు మలింగ గుర్తొచ్చాడు. ఇలాంటి పరిస్థితులను అతడు కొన్ని వందలసార్లు ఎదుర్కొన్నాడు. అయితే అతడు అప్పటికే 3 ఓవర్లపాటు బౌలింగ్ చేసి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అయినా కూడా అతడిపై నమ్మకంతో చివరి ఓవర్ వేయించానని...అది మంచి ఫలితాన్నిచ్చింది. 

అయితే మలింగకు ఆ  సమయంలో బంతిని అందించడం సాహసంగానే భావించాను. కానీ 2017 ఫైనల్లో  మిచెల్ జాన్సన్ అదరగొట్టినట్లే ఈ  శ్రీలంకన్  బౌలర్ కూడా ముంబై ని విజయతీరాలకు చేరుస్తాడని బలంగా నమ్మాను. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మలింగ  అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టుకు విజయాన్నే కాదు ఐపిఎల్ 2019 ట్రోఫీని  అందించాడు.'' అని రోహిత్ తెలిపాడు.