ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐసీసీ టీ 20 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. దీనిపై రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశారు.
ఆదివారం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐసీసీ టీ 20 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో పాటు పాకిస్తాన్‌పై అద్భుతమైన విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. పాక్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (4), రోహిత్ శర్మ (4) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
దీంతో ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టేందుకు గాను కోహ్లీ ఆచితూచి ఆడాడు. సూర్య కుమార్ యాదవ్ (15), అక్షర్ పటేల్ (2) కూడా వెంట వెంటనే పెవిలియన్ చేరడంతో భారత్ కష్టాలు రెట్టింపయ్యాయి. అయితే హార్డిక్ పాండ్యాతో (40) కలిసి విరాట్ కోహ్లీ టీమిండియాను కష్టాల నుంచి గట్టెక్కించాడు. వీరిద్దరూ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పాటు భారత్ ఆశలను సజీవంగా వుంచారు. డెత్ ఓవర్లలో క్లాస్ టచ్ ఇచ్చాడు.. పాక్ పేస్ ద్వయం షాహీన్ ఆఫ్రిది, హరీస్ రౌఫ్‌ల బౌలింగ్‌లో విధ్వంసం సృష్టించాడు . అయితే ఆఖరి ఓవర్‌లో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. కానీ మహ్మద్ నవాజ్ నో బాల్ వేయడం పాక్‌ను చావు దెబ్బ తీసింది.
Also Read:పాకిస్తాన్‌పై టీమిండియా సూపర్ విక్టరీ.. సోషల్ మీడియాలో పేలుతోన్న మీమ్స్
మరోవైపు.. ఈ విజయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. మ్యాచ్ రిజల్ట్ అస్సలు ఊహించలేదని, తనకు నోటి వెంట మాట రాలేదని అన్నాడు. ఇక్కడి పిచ్‌లో ఏదో మహాత్యం వుందని.. పాక్ ఆటగాళ్లు ఇఫ్తికార్, మసూద్‌లు చివరి వరకు పోరాడాని రోహిత్ పేర్కొన్నారు. లక్ష్యఛేదన కోసం చివరి వరకు శ్రమించామని, హార్డిక్ పాండ్యా, విరాట్‌లు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఆటను మలుపు తిప్పారని అతను అన్నాడు. ఓడిపోతామనుకున్న దశలో తిరిగి పుంజుకుని విజయం సాధించడం ఆనందాన్ని కలిగించిందని రోహిత్ హర్షం వ్యక్తం చేశాడు. హార్డిక్, విరాట్ భారత్ తరపున ఎన్నో మ్యాచ్‌లు ఆడారని.. తాము గెలిచిన విధానం బాగుందన్నాడు. విరాట్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన రోహిత్ శర్మ.. అతను భారత్ కోసం ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్ అని రోహిత్ అభివర్ణించారు.
ఇకపోతే... చాలా రోజులుగా సరైన ఫామ్‌లో లేక ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటోన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. డూ ఆర్ డై అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకు క్రీజ్‌లో నిలబడి భారత్‌ను గెలిపించాడు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురై.. కంటతడి పెట్టాడు. 53 బంతుల్లో 82 పరుగులు చేసిన కోహ్లీ.. తనను జట్టుకు దూరం చేయడం ఎందుకు తెలివైన పని కాదో మరోసారి తన ప్రదర్శన ద్వారా తెలియజేశాడు.
ఈ ఆటతీరుతో మెల్‌బోర్న్ స్టేడియంలో ప్రత్యక్షంగా వున్న 90 వేల మంది క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న అభిమానులను అలరించాడు. ఇన్నింగ్స్ ముగిసి భారత్ విక్టరీ సాధించగానే గ్రౌండ్‌లో నిలబడిన కోహ్లీకి క్రికెటర్లు, అభిమానులు చప్పట్లతో అభినందించారు. వారి మద్ధతుతో ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు. కోహ్లీ.. కోహ్ల అనే నినాదాలు ఎంసీజీలో మారుమోగాయి.
అంతేకాదు.. ఈ అద్బుత క్షణంలో కోహ్లీని కెప్టెన్ రోహిత్ శర్మ తన భుజాలపైకి ఎత్తుకుని తిప్పేశాడు. అంతేకాదు.. ఇద్దరు కలిసి గ్రౌండ్‌లో పరుగులు తీస్తూ సంబరాలు జరుపుకున్నారు. జట్టు సభ్యులు అశ్విన్, హార్డిక్ పాండ్యా సహా ఇతర సహచరులు కోహ్లీని ఆలింగనం చేసుకుని అభినందించారు. ఈ సంఘటనలతో ఆయన మ్యాన్ ఆఫ్ ది మూమెంట్‌గా నిలిచాడు. భారత్ - పాక్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో మరుపురాని మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచింది.
