టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ- హార్డిక్ పాండ్యా జోడీ అద్భుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.
చాలా రోజులుగా సరైన ఫామ్‌లో లేక ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటోన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. డూ ఆర్ డై అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకు క్రీజ్‌లో నిలబడి భారత్‌ను గెలిపించాడు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురై.. కంటతడి పెట్టాడు. 53 బంతుల్లో 82 పరుగులు చేసిన కోహ్లీ.. తనను జట్టుకు దూరం చేయడం ఎందుకు తెలివైన పని కాదో మరోసారి తన ప్రదర్శన ద్వారా తెలియజేశాడు.
ఈ ఆటతీరుతో మెల్‌బోర్న్ స్టేడియంలో ప్రత్యక్షంగా వున్న 90 వేల మంది క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న అభిమానులను అలరించాడు. ఇన్నింగ్స్ ముగిసి భారత్ విక్టరీ సాధించగానే గ్రౌండ్‌లో నిలబడిన కోహ్లీకి క్రికెటర్లు, అభిమానులు చప్పట్లతో అభినందించారు. వారి మద్ధతుతో ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు. కోహ్లీ.. కోహ్ల అనే నినాదాలు ఎంసీజీలో మారుమోగాయి.
అంతేకాదు.. ఈ అద్బుత క్షణంలో కోహ్లీని కెప్టెన్ రోహిత్ శర్మ తన భుజాలపైకి ఎత్తుకుని తిప్పేశాడు. అంతేకాదు.. ఇద్దరు కలిసి గ్రౌండ్‌లో పరుగులు తీస్తూ సంబరాలు జరుపుకున్నారు. జట్టు సభ్యులు అశ్విన్, హార్డిక్ పాండ్యా సహా ఇతర సహచరులు కోహ్లీని ఆలింగనం చేసుకుని అభినందించారు. ఈ సంఘటనలతో ఆయన మ్యాన్ ఆఫ్ ది మూమెంట్‌గా నిలిచాడు. భారత్ - పాక్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో మరుపురాని మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచింది.
భారత్ విజయం, విరాట్ కోహ్లీ అద్బుత ప్రదర్శనతో మరోసారి టీ20 ప్రపంచకప్‌ను అందుకోవాలనుకుంటున్న టీమిండియా శిబిరంలో మంచి జోష్ నింపింది. ఈ క్రమంలో ఈ విక్టరీపై సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది. క్రికెట్ లవర్స్, నెటిజన్లు విపరీతంగా మీమ్స్ వదులుతున్నారు. ట్విట్టర్, రెడ్డిట్ తదితర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో భారత్ - పాక్ మ్యాచ్‌కు చెందిన మీమ్‌లు, GIFలతో నిండిపోయాయి.
మ్యాచ్‌లో విజృంభించిన భారత బౌలర్లు పాకిస్తాన్‌ను 159/8కి పరిమితం చేశారు. లక్ష్యఛేదనలో ఆఖరి ఓవర్‌లో సూపర్‌స్టార్ విరాట్ కోహ్లీ హీరోగా అద్భుతంగా ఆడారు. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో తొలుత 45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి... విజయం కోసం పోరాడారు. కోహ్లీ- పాండ్యా జోడి భారత్‌ను కష్టాలను గట్టెక్కించడంతో పాటు చివరి ఓవర్‌లో మహ్మద్ నవాజ్ బౌలింగ్‌లో 16 పరుగులు చేయాల్సి వుంది. అయితే అతను వైడ్‌లు, నో బాల్‌లతో భారత్‌కు సహాయం చేశాడు.
దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో పాటు క్వాలిఫైయర్స్ జింబాబ్వే, నెదర్లాండ్స్‌తో కూడిన ఈ గ్రూప్‌లో విజయం చాలా కీలకం. మెజారిటీ విజయాలు సాధించిన తొలి రెండు జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. 1990వ దశకం చివరి నుంచి పాకిస్తాన్‌పై భారత్ ఎక్కువగా ఆధిపత్యం చెలాయించింది. అయితే పాకిస్తాన్‌తో జరిగిన చివరి మూడు మ్యాచ్‌లలో గతేడాది టీ20 ప్రపంచకప్, ఇటీవలి ఆసియా కప్ గ్రూప్ దశలలో భారత్ ఓడిపోయింది. అయితే ప్రస్తుతం టీమిండియా మంచి ఫామ్‌లో వుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలపై స్వదేశంలో సిరీస్‌లను గెలుచుకుంది. భారత బలమైన బ్యాటింగ్ లైనప్ విజయాలలో కీలకపాత్ర పోషిస్తోంది.
