బెంగళూరు: గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు ఇంతకాలం దూరమైన డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మకు లైన్ క్లియర్ అయ్యింది. అతడికి ఇవాళ(శుక్రవారం) జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ)లో బిసిసిఐ వైద్యబృందంతోపాటు ఎన్‌సీఏ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్, సెలక్టర్ల పర్యవేక్షణలో ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహించారు. ఇందులో రోహిత్ పూర్తి ఫిట్ గా వున్నట్లు తేలింది. దీంతో అతడు కాస్త ఆలస్యంగా అయినా ఆస్ట్రేలియాకు పయనమవ్వనున్నాడు. 

విరాట్ కోహ్లీ జట్టుకు దూరమవనున్న నేపథ్యంలో పూర్తి ఫిట్ గా వున్న రోహిత్ ను ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సీరిస్ ఆడించాలని బిసిసిఐ భావిస్తోందట. ఈ క్రమంలోనే డిసెంబర్ 14వ తేదీన రోహిత్ ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రోహిత్‌ ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడని బిసిసిఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 

ఇదిలావుంటే ఆస్ట్రేలియా టూర్‌లో కోహ్లీ లేకపోతే భారత జట్టు ఎలా ఆడుతుందో కళ్లకు కట్టినట్టు చూపించింది ఆస్ట్రేలియా ఏ, భారత్ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్. కెఎల్ రాహుల్, బుమ్రా, రిషబ్ పంత్ వంటి ఒకరిద్దరు మినహా టెస్టు జట్టులోని సభ్యులందరూ ఆడిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 

దీంతో కోహ్లీ టెస్ట్ సీరిస్ కు దూరమయ్యే లోపు రోహిత్ ను జట్టులోకి తీసుకోవాలని బిసిసిఐ భావిస్తోంది. అందులో భాగంగానే అతడికి ఫిట్ నెస్ పరీక్ష నిర్వహించి ఆస్ట్రేలియాకు పంపించే ఏర్పాట్లను ముమ్మరం చేసింది బిసిసిఐ.