ఆస్ట్రేలియా టూర్‌లో ఆఖరి రెండు టెస్టుల కోసం ఎంతో కష్టపడి అక్కడికి వెళ్లాడు ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ. ఐపీఎల్‌లో గాయపడి ఆస్ట్రేలియాతో టీ20, వన్డే సిరీస్‌కి దూరమయ్యాడు. టెస్టు సిరీస్‌కి కూడా రోహిత్ శర్మ దూరమైనట్టే అనుకుంటున్న సమయంలో ఆఖరి రెండు టెస్టుల కోసం అతన్ని ఆస్ట్రేలియాకి పంపుతున్నట్టు ప్రకటించింది బీసీసీఐ.

అనేక అవాంతరాల అనంతరం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన రోహిత్, భారత జట్టుతో కలిసి ప్రాక్టస్ మొదలెట్టాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద రోహిత్ శర్మ ఏ మాత్రం మంచి రికార్డు లేదు. 11 ఇన్నింగ్స్‌ల్లో రెండే హాఫ్ సెంచరీలు బాదాడు రోహిత్ శర్మ.

నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఐదు సార్లు పెవిలియన్ చేరాడు. ఈసారి కూడా రోహిత్‌ను టార్గెట్ చేస్తానని చెప్పాడు లియాన్. మొదటి రెండు టెస్టుల్లో విఫలమైన మయాంక్ అగర్వాల్ స్థానంలో రోహిత్ శర్మ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. 

‘ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న బెస్ట్ బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ ఒకడు. అతనికి బౌలింగ్ చేయడం బౌలర్లకు ఎప్పుడూ సవాలే. అయితే ఈ ఛాలెంజ్ స్వీకరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. రోహిత్‌ను అవుట్ చేయడానికి మా దగ్గర కావాల్సినన్ని ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి...’ అంటూ చెప్పాడు నాథన్ లియాన్.