Rohit Sharma: టీమిండియా సారథి రోహిత్ శర్మ వెస్టిండీస్ టూర్ లో అన్ని ఫార్మాట్ల సిరీస్ కు అందుబాటులో ఉండటం లేదా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆటగాళ్లు భారత్ కు చేరుకుని ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా గడుపుతున్నారు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో ఆడుతుంటే, మిగిలిన క్రికెటర్లు తమకు దొరికిన సమయాన్ని వృథా చేసుకోకుండా వెకేషన్స్, ఫ్యామిలీస్ తో గడుపుతున్నారు. విరాట్ కోహ్లీ ఇన్‌స్ట్రాగ్రామ్ స్టేటస్ లో ఆధ్యాత్మిక కొటేషన్స్ పెట్టుకుంటూ గడుపుతున్నాడు. టీమిండియా సారథి రోహిత్ శర్మ వెకేషన్ లో ఉన్నాడు. వెస్టిండీస్ టూర్ మొదలయ్యేదాకా భారత జట్టుకు మ్యాచ్ లే లేవు. అంటే జులై రెండోవారం దాకా టీమిండియా ఫుల్ ఖాళీ..
జులై 12 నుంచి టీమిండియా.. వెస్టిండీస్ తో మొదలయ్యే తొలి టెస్టుతో సిరీస్ ను మొదలుపెడుతుంది. ఈ సిరీస్ తర్వాత వన్డే సిరీస్ మొదలుకావాల్సి ఉంది. రెండూ ముగిసిన తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. అయితే టీ20 సిరీస్ కు సెలక్టర్లు రోహిత్, కోహ్లీ, అశ్విన్ లను ఎప్పుడో పక్కనబెట్టేశారు.
టీ20 సిరీస్ పోతే మిగిలింది వన్డే, టెస్టులే. ఇందులో ఒక్క ఫార్మాట్ కు పూర్తిగా టీమిండియా సారథి రోహిత్ శర్మ దూరం కానున్నాడట. విండీస్ టూర్ లో టెస్టు, వన్డేలలో భారత్ ను నడిపించాల్సి ఉన్న రోహిత్.. ఏదైనా ఒక్క ఫార్మాట్ లో మాత్రమే ఆడతాడట.. ఈ మేరకు బీసీసీఐ ప్రతినిధి ఒకరు ఈ విషయం గురించి స్పందించారు. ‘ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్ లో రోహిత్ ను చూస్తే కాస్త నీరసంగా అనిపించింది. అసలే ఈ ఏడాది భారత జట్టు వన్డే వరల్డ్ కప్ ఆడనుంది. అందుకే సెలక్టర్లు అతడిని ఏదైనా ఒక ఫార్మాట్ నుంచి విశ్రాంతి తీసుకోవాలని కోరుతున్నారు. రోహిత్ టెస్టు లేదా వన్డే ఫార్మాట్లలో ఏదో ఒకదానికి దూరంగా ఉంటాడు. దీనిపై సెలక్టర్లు త్వరలోనే రోహిత్ తో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటారు..’ అని తెలిపాడు.
విండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 లు ఆడనుంది. జులై 12 నుంచి మొదలయ్యే ఫస్ట్ టెస్టుతో భారత పర్యటన మొదలవుతుంది. ఆగస్టు 13న జరిగే చివరి టీ20తో పర్యటన ముగుస్తుంది.
షెడ్యూల్ ఇదీ..
జులై 12-16 : తొలి టెస్టు - డొమినికా
జులై 20 - 24 : రెండో టెస్టు : ట్రినిడాడ్
జులై 27 : తొలి వన్డే - బార్బోడస్
జులై 29 : రెండో వన్డే - బార్బోడస్
ఆగస్టు 1 : మూడో వన్డే - ట్రినిడాడ్
ఆగస్టు 3 : తొలి టీ20 - ట్రినిడాడ్
ఆగస్టు 6 : రెండో టీ20 - గయానా
ఆగస్టు 8 : మూడో టీ20 - గయానా
ఆగస్టు 12 : నాలుగో టీ20 - ఫ్లోరిడా (యూఎస్)
ఆగస్టు 13 : ఐదో టీ20 - ఫ్లోరిడా
