ముంబై ఇండియన్స్ ఐపిఎల్ సీజన్ 12 విజేతగా అవతరించింది. ఈ సీజన్ ఆరంభం నుండి చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడిస్తూ వస్తున్న ఈ జట్టు ఫైనల్లోనే అదే ఆటతీరును కనబర్చింది. హైదరాబాద్ వేదికగా ధోని సేనతో సాగిన ఉత్కంఠభరితంగా పోరులో రోహిత్ సారథ్యంలోని ముంబై ఒకే ఒక్క పరుగు  తేడాతో విజయం సాధించింది. ఇలా చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి లసిత్ మలింగ హీరోగా మారిపోయాడు. కానీ అతడు చివరి ఓవర్లో చివరి బంతికి వికెట్ పడగొట్టడంతో తన సలహా ఎంతగానో ఉపయోగపడిందని తాజాగా రోహిత్ వెల్లడించాడు.  

యువ కిలాడీ శార్దూల్ ఠాకూర్ తో కలిసి ముంబై  తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడినట్లు రోహిత్ గుర్తుచేశాడు. ఆ సమయంలో కలిసి ఆడటం వల్ల అతడి బలాబలాలేంటో తనకు తెలిసిందన్నాడు. అందువల్ల చెన్నైతో జరిగిన ఫైనల్ మ్యాచ్ శార్దూల్ ఔట్ చేయడానికి మలింగతో కలిసి ఓ వ్యూహాన్ని రచించానని...అది ఫలితాన్నిచ్చిందని రోహిత్ అన్నాడు. 

''వాట్సన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శార్దూల్ ను ఔట్ చేయాలన్నది మా ప్లాన్. అయితే అతడు ఎలా  ఆడతాడో నాకు కొద్దిగా అవగాహన వుంది. అందువల్లే మలింగ వద్దకు వెళ్లి స్లో బాల్ వేయాలని సూచించా. ఎందుకంటే అతడు చివరి బంతికి బిగ్ షాట్ బాదడానికి ప్రయత్నిస్తాడని ఊహించా. నేను అనుకున్నట్లే అతడు  అలాంటి ప్రయత్నమే చేసి ఔటయ్యాడు. '' అని  రోహిత్ పేర్కొన్నాడు.

ఇలా శార్దూల్ వికెట్ పడగొట్టడంలో మలింగకు తన సలహా ఎంతగానో ఉపయోగపడిందని  అన్నాడు. అయితే ఈ వికెట్ తీసిన క్రెడిత్ మొత్తం మలింగకే దక్కుతుందని రోహిత్ ప్రశంసించాడు.