మళ్లీ పాస్‌పోర్ట్ మరిచిపోయిన రోహిత్ శర్మ... ఆఖరి నిమిషంలో సపోర్ట్ స్టాఫ్‌తో...

ఆసియా కప్ 2023 టోర్నీ ముగించుకుని స్వదేశానికి పయనమైన రోహిత్ శర్మ అండ్ టీమ్... బస్సు ఎక్కిన తర్వాత పాస్‌పోర్ట్ మరిచిపోయిన విషయం గుర్తుకు రావడంతో... 

Rohit Sharma forgets his passport in hotel room, before heading to India, Asia Cup 2023 CRA

రోహిత్ శర్మకు మతిమరుపు చాలా ఎక్కువ. రోహిత్ ఓసారి వెడ్డింగ్ రింగ్‌ని కూడా హోటల్ రూమ్‌లో మరిచిపోయి వచ్చాడని, ఆరేళ్ల క్రితం విరాట్ కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. రోహిత్ కూడా ఈ విషయాన్ని చాలాసార్లు ఒప్పుకున్నాడు. తాజాగా మరోసారి తన మతిమరుపుతో వార్తల్లో నిలిచాడు రోహిత్...

ఆసియా కప్ 2023 ఫైనల్ తర్వాత భారత జట్టు, స్వదేశానికి పయనమైంది. టీమ్ ప్లేయర్లు అందరూ బస్సు ఎక్కి కూర్చున్న తర్వాత తాపీగా వచ్చాడు రోహిత్ శర్మ. బస్సు ఎక్కిన తర్వాత పాస్‌పోర్ట్ మరిచిపోయిన విషయం గుర్తుకు రావడంతో వెంటనే సపోర్టింగ్ స్టాఫ్‌కి తీసుకురమ్మని చెప్పాడు. బస్సు లోపల జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా కూర్చొని జరిగేదంతా గమనిస్తున్నారు. 

రోహిత్ శర్మ లోపలికి రాగానే, ‘నీకోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేయడం, వీడియోలో వినిపించింది. ఈ  దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు క్రికెట్ ఫ్యాన్స్, మొబైల్‌లో చిత్రీకరించారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ మతిమరుపు గురించ విరాట్ కోహ్లీ చెప్పింది అక్షరాల సత్యం అంటూ కామెంట్లు పెడుతున్నారు భారత క్రికెట్ ఫ్యాన్స్.. 

ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌ మూడు గంటల్లోనే ముగిసింది. వర్షం కారణంగా 35 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్, సరిగ్గా 22 ఓవర్లు కూడా సాగలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లు బ్యాటింగ్ చేసింది. సిరాజ్ సెన్సేషనల్ స్పెల్‌తో లంక 50 పరుగులకే ఆలౌట్ కాగా, ఈ లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా 6.1 ఓవర్లలోనే ఛేదించింది టీమిండియా..

టార్గెట్ మరి చిన్నది కావడంతో ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ కలిసి ఓపెనింగ్ చేశారు. ఇంతకుముందు వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లో 115 పరుగుల లక్ష్యఛేదనలోనూ ఇషాన్ కిషన్, గిల్ కలిసి ఓపెనింగ్ చేశారు. అయితే ఆ మ్యాచ్‌లో భారత జట్టు వెంటవెంటనే 5 వికెట్లు కోల్పోవడంతో 7వ బ్యాటర్‌గా రోహిత్ క్రీజులోకి రావాల్సి వచ్చింది. అయితే ఈసారి అలాంటి అవకాశం లేకుండా భారత బ్యాటర్లు తాపీగా పని ముగించేశారు.. 

షెడ్యూల్ టైం కంటే ముందే మ్యాచ్ ముగియడంతో భారత జట్టు, అనుకున్న సమయం కంటే ముందుగానే ఇండియాకి పయనమైంది. సెప్టెంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడబోతోంది భారత జట్టు. ఈ సిరీస్‌కి ఇంకా జట్టును ప్రకటించలేదు..

వన్డే వరల్డ్ కప్ ఆడే టీమ్‌నే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనూ ఆడించే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ కప్‌కి ముందు కీ ప్లేయర్లకు గాయాలు కాకుండా రొటేషన్ పద్ధతిలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడే అవకాశం ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios