IND vs SA T20I: ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య నేడు అసోంలోని గువహతిలో రెండో టీ20 జరగాల్సి ఉంది. కానీ ఈ మ్యాచ్ కు వర్షం ముప్పుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈశాన్య భారతాన అసోం పెద్ద (జనాభాపరంగా) రాష్ట్రం. గువహతి దాటి భారత జట్టు మిగిలిన రాష్ట్రాలలో క్రికెట్ ఆడిన దాఖలాలు కూడా లేవు. దీంతో ఈశాన్య రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు గువహతిలో మ్యాచ్ జరుగుతుందంటే పండుగే. సుమారు రెండేండ్ల తర్వాత ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండటంతో ఇక్కడి క్రికెట్ ప్రేమికులు కూడా రెండు అగ్రశ్రేణి జట్ల ఆటను వీక్షించడానికి సిద్ధమయ్యారు. కానీ ఈ మ్యాచ్ కూడా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇటీవలే ముగిసిన మరో నాగ్‌పూర్ మ్యాచ్‌లా మారనుందా..? అంటే అవుననే అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. నేటి మ్యాచ్ జరుగుతున్న గువహతిలో వర్షం కురిసే అవకాశాలు 40 శాతంగా ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది.
భారత్-దక్షిణాఫ్రికా మధ్య గతనెల 28న తిరువనంతపురంలో తొలి మ్యాచ్ జరగగా టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా గువహతిలో కూడా తొలి మ్యాచ్ జోరునే కొనసాగించి మరో సిరీస్ పట్టేయాలని టీమిండియా భావిస్తున్నా వరుణుడు ఏం చేస్తాడోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నేటి రాత్రి గువహతిలో వర్షం కురిసే అవకాశాలు 40 శాతం దాకా ఉన్నాయని తెలిపింది. అదేజరిగితే నేటి మ్యాచ్ జరుగుతున్న బర్సపర స్టేడియంలో ప్రేక్షకులకు మరోనిరాశ తప్పదు. చివరిసారి ఇక్కడ 2020 జనవరిలో ఇండియా-శ్రీలంక టీ20ని నిర్వహించాల్సి ఉన్నా అప్పుడు కూడా వర్షం కారణంగానే మ్యాచ్ రద్దైంది. ఆ తర్వాత రెండేండ్లకు మళ్లీ ఇక్కడ మ్యాచ్ జరుగుతుంటే దానికి వరుణుడి ముప్పు ఉందని వాతావరణ శాఖ చెబుతుండటం ప్రేక్షకులకు ఆందోళనకు గురి చేస్తున్నది.
ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్ లో భాగంగా మొహాలీలో మ్యాచ్ ముగిశాక రెండో టీ20 నాగ్‌పూర్ లో జరిగింది. అయితే వర్షం కారణంగానే ఈ మ్యాచ్ జరుగుతుందా..? లేదా..? అనే సందిగ్దం నుంచి చివరికి 8 ఓవర్లకు కుదించి మ్యాచ్ ను నిర్వహించారు. మరి బర్సపరలో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా..? లేక పూర్తిగా రద్దవుతుందా..? అనేది కొన్నిగంటల్లో తేలనుంది.
నాగ్‌పూర్ మాదిరిగానే ఇక్కడ కూడా స్టేడియంలో నీటిని డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటకు పంపించే సదుపాయం లేదు. దీంతో చిరుజల్లులతో కూడిన వర్షం కురిస్తే పెద్దగా ఇబ్బంది లేదుగానీ భారీ వర్షం కురిస్తే మాత్రం ప్రేక్షకులకు నిరాశ తప్పదు. అమెరికా నుంచి అధునాతన కవర్లను తెప్పించామని రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చెబుతున్నా డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా లేకుంటే ఎన్ని కవర్లు తెప్పించినా ఏం ఉపయోగం..? అని అభిమానులు వాపోతున్నారు.
