ఇంగ్లాండ్ వేదికగా రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్ 3... ఇండియాలో మొదటి రెండు సీజన్లు! సెప్టెంబర్ మొదటి వారంలో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్...
రిటైర్మెంట్ తర్వాత సచిన్ టెండూల్కర్, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో రెండు సీజన్లలో పాల్గొన్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ మూడో సీజన్ జరగనుంది. ఈసారి పాకిస్తాన్ జట్టు కూడా ఈ మాజీల మెగా టోర్నీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం..
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో మొదటి రెండు సీజన్లు కూడా ఇండియాలోనే జరిగాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరిగా లేకపోవడంతో పాకిస్తాన్ జట్టు, మొదటి రెండు సీజన్లలోపాల్గొనలేదు. ఈసారి పాకిస్తాన్ పాల్గొనేందుకు అనుగుణంగా ఇంగ్లాండ్ వేదికగా రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్ 3ని జరిపించబోతున్నట్టు సమాచారం..
ఈ సీజన్‌లో మొత్తంగా 9 టీమ్స్ పాల్గొనబోతున్నాయి. త్వరలో తేదీలు, షెడ్యూల్ జరిగే వేదికలు ఫైనలైజ్ చేయబోతున్నారు. అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభం కాబోతోంది. దీంతో సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2023 సీజన్, మూడు వారాల్లో ముగియనుంది..
మార్చి 2020లో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ప్రారంభమైంది. అయితే నాలుగు మ్యాచులు ముగియగానే కరోనా లాక్‌డౌన్ రావడంతో సీజన్ అర్ధాంతరంగా వాయిదా పడింది. తిరిగి మార్చి 2021లో రాయిపూర్ వేదికగా ప్రారంభమైంది ఈ టోర్నీ...
కరోనా ఆంక్షలు, క్వారంటైన్, ఐసోలేషన్ నిబంధనల కారణంగా మొదటి నాలుగు మ్యాచులు ఆడిన ఆస్ట్రేలియా, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ నుంచి తప్పుకుంది. ఆస్ట్రేలియా ప్లేస్‌లో బంగ్లాదేశ్, మొదటి సీజన్ ఆడింది. ఈ సమయంలోనే సచిన్ టెండూల్కర్‌తో పాటు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు...
సెప్టెంబర్ 2022లో రెండో సీజన్ రాయిపూర్, డెహ్రాడూన్‌లలో జరిగింది. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా కూడా ఆడాయి. మొదటి రెండు సీజన్లలోనూ సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోని ఇండియా లెజెండ్స్ టైటిల్స్ గెలిచింది. ఇండియా లెజెండ్స్ తరుపున యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు ఆడారు..
వీరితో పాటు కేవిన్ పీటర్సన్, సనత్ జయసూర్య, షేన్ వాట్సన్, తిలకరత్నే దిల్షాన్, రికీ పాంటింగ్, బ్రియాన్ లారా, బ్రెట్ లీ వంటి మాజీ లెజెండరీ క్రికెటర్లు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టోర్నీల్లో ఆడారు. పాకిస్తాన్ టీమ్ కూడా జత అయితే మిస్బా వుల్ హక్, షోయబ్ అక్తర్, షాహీద్ ఆఫ్రిదీ, యూనిస్ ఖాన్, ఇంజమామ్ వుల్ హక్ వంటి మాజీ పాక్ క్రికెటర్లు, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఆసియా లయన్స్ టీమ్ తరుపున మిస్బా వుల్ హక్, కమ్రాన్ అక్మల్, ఉమర్ గుల్, మహ్మద్ హఫీజ్, మహ్మద్ యూసఫ్ వంటి మాజీ పాక్ క్రికెటర్లు ఆడుతున్నారు.
ఇండియా లెజెండ్స్‌తో పాటు శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లు ఇప్పటిదాకా రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొంటున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఈ లిస్టులో చేరనుంది.
