Asianet News TeluguAsianet News Telugu

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022: సౌతాఫ్రికాపై ఇండియా లెజెండ్స్ ఘన విజయం...

India Legends vs South Africa Legends: 156 పరుగులకి పరిమితమైన సౌతాఫ్రికా లెజెండ్స్... 61` పరుగుల తేడాతో ఘన విజయం అందుకున్న ఇండియా లెజెండ్స్ టీమ్...

Road safety World Series 2022: India legends beats South Africa legends with huge margin
Author
First Published Sep 10, 2022, 11:15 PM IST

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్ 2ని ఘనంగా ఆరంభించింది డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా లెజెండ్స్ టీమ్. తొలుత భారత బ్యాటర్లు చెలరేగి జట్టుకి 217 భారీ స్కోరు అందించగా ఆ తర్వాత బౌలర్లు అదరగొట్టి ప్రత్యర్థిని 156 పరుగులకే పరిమితం చేశారు. ఫలితంగా తొలి మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది టెండూల్కర్ టీమ్.. 

218 పరుగుల భారీ లక్ష్యఛేదనని నెమ్మదిగా ఆరంభించింది సౌతాఫ్రికా లెజెండ్స్ టీమ్. 24 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన మోర్నే వార్ విక్‌ని రాహుల్ శర్మ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. 23 పరుగులు చేసిన ఆండ్రూ పుటిక్‌ని ప్రజ్ఞాన్ ఓజా పెవిలియన్ చేర్చాడు. ఆల్వీరో పీటర్సన్ 10, జాక్వెస్ రులోఫ్ 16, హెన్రీ డేవిడ్స్ 6, జోహన్ బోథా 8, మకాయ ఎన్తీని 6 పరుగులు చేసి అవుట్ కాగా జోహన్ వాన్ దేర్ వాత్, ఎడ్డీ లీ డకౌట్ అయ్యారు...
 
సౌతాఫ్రికా లెజెండ్స్ కెప్టెన్ జాంటీ రోడ్స్ 27 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

భారత లెజెండ్స్ బౌలర్లలో రాహుల్ శర్మ 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీయగా మునాఫ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా రెండేసి వికెట్లు తీశారు. యువరాజ్ సింగ్ ఓ వికెట్ తీయగా ఇర్ఫాన్ పఠాన్‌కి ఓ వికెట్ దక్కింది.  

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత లెజెండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 217 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇండియా లెజెండ్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్, నామన్ ఓజాతో కలిసి ఓపెనింగ్ చేశాడు...

ఈ ఇద్దరూ తొలి వికెట్‌కి 46 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 15 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, మక్కాయ ఎన్తినీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 18 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేసిన నామన్ ఓజా... వార్ దేవ్ వాత్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

52 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఇండియా లెజెండ్స్ టీమ్. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన సురేష్ రైనా, స్టువర్ట్ బిన్నీ కలిసి మూడో వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 22 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసిన సురేష్ రైనా, ఎడ్డీ లీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

యువరాజ్ సింగ్ 8 బంతుల్లో 6 పరుగులు చేసి తన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ మాత్రం సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాడు. 42 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 82 పరుగులు చేసిన స్టువర్ట్ బిన్నీ, సౌతాఫ్రికా సీనియర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు...

స్టువర్ట్ బిన్నీ చేసిన 82 పరుగులే, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భారత లెజెండ్స్‌కి అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇంతకుముందు గత సీజన్‌లో 35 బంతుల్లో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును దాటేశాడు స్టువర్ట్ బిన్నీ. ఓవరాల్‌గా ఈ టోర్నీలో నాలుగో అత్యుత్తమ స్కోరు నమోదు చేశాడు స్టువర్ట్ బిన్నీ..


శ్రీలంక లెజెండ్స్ ప్లేయర్ ఉపుల్ తరంగ 47 బంతుల్లో 99 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా ఆస్ట్రేలియా లెజెండ్స్ ప్లేయర్ రేర్‌డన్ 53 బంతుల్లో 96 పరుగులు, సౌతాఫ్రికా లెజెండ్స్ ప్లేయర్ ఆండ్రూ పుట్టిక్ 54 బంతుల్లో 82 పరుగులు చేసి స్టువర్ట్ బిన్నీ కంటే ముందున్నారు. 

మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ 15 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 35 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. ఆఖరి 5 ఓవర్లలో 79 పరుగులు రాబట్టి భారత లెజెండ్స్ టీమ్. 

Follow Us:
Download App:
  • android
  • ios