తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్... రెండో ఇన్నింగ్స్‌లో బరిలో దిగడం లేదు. పంత్ అయిన గాయం తీవ్రత తెలుసుకునేందుకు డాక్టర్‌తో కలిసి స్కానింగ్‌కి పంపించింది టీమిండియా మేనేజ్‌మెంట్.

దీంతో కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌ విధానం ద్వారా వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్ స్థానంలో వికెట్ కీపింగ్ చేయబోతున్నాడు. 67 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసిన రిషబ్ పంత్... ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో గాయపడ్డాడు. 141కి.మీ. ల వేగంతో దూసుకొచ్చిన బంతి, రిషబ్ పంత్ మోచేతికి బలంగా తాకింది.

నొప్పితో విలవిలలాడిన రిషబ్ పంత్, ఫిజియో పర్యవేక్షణ తర్వాత బ్యాటింగ్ కొనసాగించాడు. అవుటైన తర్వాత డాక్టర్ల సలహాతో అతన్ని స్కానింగ్‌కి తరలించింది బీసీసీఐ.

మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా కూడా గాయపడ్డాడు. ఎడమ చేతి బొటిన వేలుకి బలంగా బంతి తాకింది. అయితే టేప్ వేసుకుని బ్యాటింగ్ కొనసాగించాడు జడ్డూ. అతని స్థానంలో మయాంక్ అగర్వాల్ ఫీల్డింగ్‌కి వచ్చాడు.