INDvsAUS 2nd Test: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ నెలన్నర క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ముంబైలో చికిత్స పొందుతున్నాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భారత అభిమానులు అతడిని మిస్ అవుతున్నారు.
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టుతో పాటు టీమిండియా ఫ్యాన్స్ బాగా మిస్ అవుతున్న క్రికెటర్ రిషభ్ పంత్. ఆస్ట్రేలియా అంటేనే రెచ్చిపోయి ఆడే పంత్ లేకపోవడంతో భారత్ జట్టులో కూడా ఆ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. వికెట్ కీపర్ గా కోన శ్రీకర్ భరత్ ను తుది జట్టులో ఆడిస్తున్నా వికెట్ల వెనుక అతడు పంత్ లేని లోటును తీర్చలేకపోతున్నాడు. వికెట్ కీపింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా భరత్.. అతడిని మరిపించలేకపోతున్నాడు. దీంతో గత రెండు టెస్టులలో అభిమానులు.. ‘వి మిస్సింగ్ యూ పంత్..’అని ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.
తాజాగా టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పంత్ లేని లోటు స్పష్టంగా తెలుస్తుందని.. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. రెండో టెస్టులో రెండో రోజు భారత్ బ్యాటింగ్ చేస్తుండగా కామెంట్రీ చెబుతూ సన్నీ ఎమోషనల్ అయ్యాడు.
రెండో రోజు భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో తడబడుతున్న సందర్భంలో స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్ అంతా ‘రిషభ్ రిషభ్’అని అరిచారు. అంతేగాక ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఐదు వికెట్లతో చెలరేగుతున్న వేళ.. ‘పంత్ ఉంటే లియాన్ పప్పులేమీ ఉడకపోవు.. అతడికి పంతే కరెక్ట్ మొగుడు..’ అని ట్విటర్ లో కామెంట్స్ చేశారు.
ఇక అభిమానులు రిషభ్ రిషభ్ అని అరవడంతో కామెంట్రీ చెబుతున్న గవాస్కర్ కూడా స్పందిస్తూ... ‘ఆస్ట్రేలియా చాలా లక్కీ టీమ్. ఎందుకంటే ఈసారి రిషభ్ పంత్ టీమ్ లో లేడు. పంత్ ఉండి ఉంటే ప్రస్తుతం స్కోరుబోర్డు మరో విధంగా ఉండేది. పంత్ నువ్వు నా మాటలు వింటున్నావా..? ఒకవేళ వింటే మాత్రం మేం నిన్ను చాలా మిస్ అవుతున్నాం. త్వరగా కోలుకో..’ అని అన్నాడు.
గతేడాది డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ కు వెళ్తూ కారు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పంత్ కోలుకోవడానికి మరో ఆరేడు నెలలు పట్టొచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే పంత్ చేతికర్ర సాయంతో మెల్లిగా నడుస్తున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఆ ఫోటోకు ‘ఒక అడుగు ముందుకు, ఒక అడుగు బలంగా, ఒక అడుగు మెరుగ్గా..’ అని రాసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఇదిలాఉండగా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు రెండో టెస్టును కూడా గెలుచుకుని సిరీస్ లో 2-0 ఆధిక్యాన్ని దక్కించుకుంది. నాగ్‌పూర్ టెస్టు మాదిరిగానే ఈ టెస్టులో కూడా భారత స్పిన్ ద్వయం అశ్విన్ - జడేజాలు విజృంభించి ఆసీస్ బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశారు.
