లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రిషబ్ పంత్ పై విమర్శల వర్షం కురుస్తోంది. వెస్టిండిస్ పర్యటనతో పాటు తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో ముగిసిన టీ20  సీరిస్ లోనూ అతడు ఆశించినస్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో అతన్ని భారత జట్టులోకి తీసుకోవాలని కోరిన అభిమానులే ఇప్పుడు అతన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

అయితే ఇలా ఫామ్ లేమితో బాధపడుతున్న రిషబ్ పంత్ కు హైదరబాదీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ మద్దతుగా నిలిచారు. అతడు తీవ్ర ఒత్తిడితో అంతర్జాతీయ క్రికెట్లోకి ఆడుగుపెట్టినట్లు తెలిపారు. ఆ  ఒత్తిడి ఇప్పటికీ కొనసాగుతుండటం పంత్ వరుస వైఫల్యాలకు కారణమని లక్ష్మణ్ పేర్కొన్నారు.

''అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో అద్భుతాలు సృష్టించిన సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని పంత్ దక్కించుకున్నాడు. దీంతో అతడిపై తీవ్ర ఒత్తిడి  నెలకొంది. అభిమానులు కూడా దోని స్థాయిలో పంత్ ఆడాలని  కోరుకుంటున్నారు. దీంతో అతడెంత  గొప్పగా ఆడినా అభిమానులకు  నచ్చడం లేదు. ఈ  ఒత్తిడి నుండి బయటపడితే పంత్ తప్పకుండా రాణించగలడు.

ఇక నాలుగో స్ధానంలో బ్యాటింగ్ కు దిగడం కూడా పంత్ కు సమస్యగా  మారింది. స్వేచ్చగా భారీ షాట్లతో దూకుడుగా ఆడటం పంత్ బ్యాటింగ్ స్టైల్. కానీ  నాలుగో స్థానంలో వికెట్లను కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడాల్సి వుంటుంది. ఇలా ఆడటం పంత్ కు కుదరడం లేదు. కాబట్టి అతన్ని నాలుగో స్థానంలో కాకుండా ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ కు పంపించాలి. 

బెంగళూరులో ఇటీవలే ముగిసిన టీ20 లో అతడు సహజ  శైలికి భిన్నంగా ఆడేందుకు ప్రయత్నించాడు.భారీ షాట్లకు ప్రయత్నించకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడు. కానీ అది సాధ్యం కాలేదు. కాబట్టి పంత్ ను 5 లేదా 6వ స్ధానంలో బ్యాటింగ్ కు పంపి శ్రేయాస్ అయ్యర్,హార్దిక్ పాండ్యాలలో ఎవరో ఒకరిని నాలుగో స్ధానంలో ఆడించాలి.'' అని వివిఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. 

ఇప్పటికే టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ లు రిషబ్ పంత్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాగే ఆడితే  జట్టులో చోటు కోల్పోవడం ఖాయమని హెచ్చరించారు. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అయితే పంత్ పై విరుచుకుపడ్డాడు. అతడు కేవలం టీమిండియా మేనేజ్‌మెంట్ అతిప్రేమ వల్లే జట్టులో కొనసాగుతున్నట్లు ఎద్దేవా చేశాడు. ఇలా పంత్ పై అందరూ  విమర్శలు ఎక్కుపెడితే లక్ష్మణ్ మాత్రం మద్దతుగా నిలిచాడు.