భారత్-సౌతాఫ్రికాల మధ్య జరిగిన టీ20 సీరిస్ సమమయ్యింది. మొహాలీ టీ20లో పర్యాటక జట్టును ఓడించగలిగిన కోహ్లీసేన ఆటలు బెంగళూరులో మాత్రం సాగలేదు. నిర్ణయాత్మకమైన ఈ టీ20 మ్యాచ్ లో సౌతాఫ్రికా ఆటగాళ్లు అన్ని విభాగాల్లోనూ సమిష్టిగా రాణించి భారత్ పై పైచేయి సాధించారు. ఇలా ప్రపంచ కప్ తర్వాత టీమిండియా మొదటి ఓటమిని చవిచూసింది. 
  
స్వదేశంలో భారత జట్టు ఇలా ఓటమిపాలవ్వడాన్ని అభిమానులు సహించలేకపోతున్నారు. దీంతో ఈ మ్యాచ్ ఓటమికి కెప్టెన్ కోహ్లీ అనాలోచిత నిర్ణయమే కారణమని మండిపడుతున్నారు. అతడు తన హోం గ్రౌండ్(ఐపిఎల్ లో బెంగళూరు జట్టు కెప్టెన్)లో పిచ్ నే సరిగ్గా అంచనా వేయలేకపోయాడని ఆరోపిస్తున్నారు. టాస్ గెలిచినా కూడా అతడు పిచ్ ను అంచనా వేయలేకపోడం దురదృష్టకరమని అంటున్నారు. చేజింగ్ కు అనుకూలించే పిచ్ పై బ్యాటింగ్ ఎంచుకోవడం వల్లే భారత్ ఓటమిపాలయ్యిందని ఆరోపిస్తున్నారు. 

మ్యాచ్ అనంతరం కోహ్లీ కూడా అభిమానుల అభిప్రాయాన్నే సమర్థించాడు.'' బెంగళూరు పిచ్ ను సరిగ్గా అంచనావేయలేకపోయాం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాలన్న మా నిర్ణయం బెడిసికొట్టింది. ముందుగా బ్యాటింగ్ కు దిగడం వల్లే ఈ మ్యాచ్ చేజారిపోయింది. కాబట్టి తదుపరి మ్యాచుల్లో ఇలాంటి తప్పులు జరక్కుంగా చూసుకుంటాం.'' అని కోహ్లీ వివరణ ఇచ్చుకున్నాడు. 

అంతకుముందు టాస్ సమయంలో కూడా కోహ్లీ సాహాసోపేతమైన నిర్ణయం తీసుకుంటున్నట్లు అభివర్ణించాడు. ''చిన్నస్వామి స్టేడియంలో లక్ష్యఛేదనే సులభమన్న విషయం నాకు కూడా  తెలుసు. కానీ టీ20 ప్రపంచ కప్ ప్రయోగాల్లో  భాగంగానే ఈ  నిర్ణయం తీసుకున్నాం. మా జట్టు బలాబలాలను, ఆటగాళ్ళ  సామర్థ్యాన్ని  తెలుసుకునేందుకే ఈ ప్రయోగం. ముఖ్యంగా  ప్రతికూల పరిస్థితుల్లో  కూడా ఫలితాన్ని అనుకూలంగా ఎలా రాబట్టాలో తెలుసుకునేందుకే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాం. '' అని తెలిపాడు.