ఆర్‌సీబీపై 54 పరుగుల తేడాతో విజయం అందుకుని, ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకున్న పంజాబ్ కింగ్స్... పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకిన పంజాబ్...
వరుసగా మూడో మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుందామని ఆశపడిన ఆర్‌సీబీకి పంజాబ్ కింగ్స్ మరోసారి షాక్ ఇచ్చింది. కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 54 పరుగుల తేడాతో ఓడించిన పంజాబ్ కింగ్స్, ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
210 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఆర్‌సీబీ, 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాతమ్రే చేయగలిగింది. వరుసగా విఫలమవుతున్న విరాట్ కోహ్లీ, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో శుభారంభం లభించినా, దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు...
14 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, కగిసో రబాడా బౌలింగ్‌లో రాహుల్ చాహార్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ గ్లవ్స్‌ని తాకుతూ వెళ్లిన బంతి, రాహుల్ చాహార్ చేతుల్లోకి వెళ్లి వాలింది.
అయితే ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 6500+ పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్‌లో 6 వేల పరుగుల మైలురాయి అందుకున్న మొట్టమొదటి క్రికెటర్ విరాట్ కోహ్లీయే కాగ ఇప్పుడు 6500 పరుగుల మైలురాయి కూడా ఆయన ఖాతాలోనే చేరింది...
ఓవరాల్‌గా టీ20ల్లో 10500 పరుగులు చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది ఆర్‌సీబీ. 8 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, రిషి ధావన్ బౌలింగ్‌లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
3 బంతుల్లో ఓ సిక్సర్‌తో 6 పరుగులు చేసిన మహిపాల్ లోమ్రోర్ కూడా అదే ఓవర్‌లో శిఖర్ ధావన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ దశలో రజత్ పటిదార్, మ్యాక్స్‌వెల్ కలిసి నాలుగో వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...
21 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసిన రజత్ పటిదార్, రాహుల్ చాహార్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో రజత్ పటిదార్, 102 మీటర్ల భారీ సిక్సర్ సంధించాడు. ఈ సిక్సర్ నేరుగా వెళ్లి, స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ఓ ముసలాయన తలపై తగలింది. దీంతో ఆయనకు గాయమై, రక్తం కారడంతో వెంటనే పక్కనున్నవాళ్లు సేద తీర్చే ప్రయత్నం చేశారు...
10.5 ఓవర్లు ముగిసే సమయానికి 103 పరుగులు చేసి కాస్త పటిష్టంగానే కనిపించిన ఆర్‌సీబీ, ఆ తర్వాత మరోసారి రెండు వరుస వికెట్లు కోల్పోయింది. రజత్ పటిదార్ అవుటైన తర్వాత రెండో బంతికే మ్యాక్స్‌వెల్ కూడా పెవిలియన్ చేరాడు. 22 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్, హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
దినేశ్ కార్తీక్ 11, షాబాజ్ అహ్మద్ 9, హర్షల్ పటేల్ 11, వానిందు హసరంగ 1 పరుగులు చేసి అవుట్ కాగా సిరాజ్ 9, హజల్‌వుడ్ 7 పరుగులు చేసి ఆర్‌సీబీని ఆలౌట్ కాకుండా కాపాడగలిగారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. జోష్ హజల్‌వుడ్ వేసిన మొదటి ఓవర్‌లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో కలిపి 22 పరుగులు రాబట్టాడు జానీ బెయిర్ స్టో. ఆ తర్వాతి ఓవర్‌లో 13 పరుగులు రాగా మూడో ఓవర్‌లో 7 పరుగులే ఇచ్చాడు హజల్‌వుడ్. 15 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన శిఖర్ ధావన్‌ను గ్లెన్ మ్యాక్స్‌వెల్ క్లీన్ బౌల్డ్ చేశాడు...
మహ్మద్ సిరాజ్ వేసిన 6వ ఓవర్‌లో ఏకంగా మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 23 పరుగులు రాబట్టాడు బెయిర్‌స్టో. మొదటి బంతికే బెయిర్ స్టో ఎల్బీడబ్ల్యూ అవుట్ కోసం అప్పీలు చేసి, డీఆర్‌ఎస్ తీసుకుంది ఆర్‌సీబీ. టీవీ రిప్లైలో జానీ బెయిర్ స్టో బ్యాటుకి బంతి తగిలినట్టు స్పష్టంగా కనిపించకపోయినా థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడం వివాదాస్పదమైంది...
3 బంతుల్లో 1 పరుగు చేసిన భనుక రాజపక్ష, హసరంగ బౌలింగ్‌లో అవుట్ కాగా 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జానీ బెయిర్ స్టో, ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి 6 ఓవర్లలో 83 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్, ఆ తర్వాత కాస్త నెమ్మదించింది...
29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 66 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో, షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో సిరాజ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 16 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
5 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన జితేశ్ శర్మ, హసరంగ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ వికెట్‌తో సీజన్‌లో 23 వికెట్లు పూర్తి చేసుకున్న వానిందు హసరంగ, పర్పుల్ క్యాప్ రేసులో టాప్‌లోకి దూసుకొచ్చాడు. యజ్వేంద్ర చాహాల్ 23 వికెట్లతో ఉన్నా, యావరేజ్ బెటర్‌గా ఉండడంతో హసరంగ టాప్‌లోకి వెళ్లాడు.
హర్షల్ పటేల్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన హర్‌ప్రీత్ బ్రార్, ఆ తర్వాతి బంతికే దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. హజల్‌వుడ్ వేసిన 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 24 పరుగులు రాబట్టిన లియామ్ లివింగ్‌స్టోన్, సీజన్‌లో నాలుగో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు...
ఓ వైపు జానీ బెయిర్ స్టో, మరో వైపు లియామ్ లివింగ్‌స్టోన్ ఉతికి ఆరేయడంతో 4 ఓవర్లలో వికెట్లేమీ తీయలేకపోయిన జోష్ హజల్‌వుడ్ ఏకంగా 64 పరుగులు సమర్పించి చెత్త రికార్డు క్రియేట్ చేశాడు.. 42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
