Asianet News TeluguAsianet News Telugu

కివీస్ ఆల్ రౌండర్‌తో ఆర్సీబీ డీల్.. ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్న బ్రాస్‌వెల్.. ధర ఎంతంటే..!

IPL 2023: ఐపీఎల్ లో ఆర్సీబీ అభిమానులకు గుడ్ న్యూస్. న్యూజిలాండ్ ఆల్ రౌండర్  మైఖేల్ బ్రాస్‌వెల్ ఆర్సీబీ తరఫున ఆడనున్నాడు. 

RCB Signed Michael Bracewell As Replacement Of Injured Will Jacks MSV
Author
First Published Mar 18, 2023, 4:21 PM IST

ఆర్సీబీ అభిమానుల ఉత్కంఠకు టీమ్ మేనేజ్మెంట్ తెరదించింది. త్వరలో మొదలుకాబోయే ఐపీఎల్  - 2023 సీజన్  లో   ఆ జట్టులోకి విధ్వంసక ఆల్ రౌండర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కొద్దిరోజుల క్రితం బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో గాయపడి  ఐపీఎల్  నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ స్థానంలో  ఆర్సీబీ.. న్యూజిలాండ్ ఆల్ రౌండర్  మైఖేల్ బ్రాస్‌వెల్ ను  రిప్లేస్ చేసుకుంది.  

ఈ మేరకు ఆర్సీబీ అధికారిక ప్రకటన కూడా వెలువరించింది.  ‘రాబోయే ఐపీఎల్ సీజన్ లో విల్ జాక్స్   స్థానాన్ని కివీస్ ఆటగాడు  మైఖేల్ బ్రాస్‌వెల్ రిప్లేస్ చేయనున్నాడు. 32 ఏండ్ల ఈ ఆల్ రౌండర్   ఇటీవల  భారత పర్యటనకు వచ్చిన కివీస్ జట్టులో టీ20లలో హయ్యస్ట్ వికెట్ టేకర్ గా ఉన్నాడు.  వన్డే గేమ్ లో 140 పరగులు కూడా చేశాడు..’అని రాసుకొచ్చింది.

విల్ జాక్స్ ను గతేడాది డిసెంబర్ లో నిర్వహించిన మినీ వేలంలో రూ. 3.2 కోట్లకు దక్కించుకున్న  ఆర్సీబీ.. బ్రాస్‌వెల్ ను మాత్రం  బేస్ ప్రైస్ కే  తీసుకుంది. గత వేలంలో బ్రాస్‌వెల్ సాధారణ ధర  (కోటి రూపాయలు) పేరు నమోదు చేసుకున్నా అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు. ఇప్పుడు అదే ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.   ఆర్సీబీకి గ్లెన్ మ్యాక్స్‌వెల్ రూపంలో ఆల్ రౌండర్ ఉన్నా నాలుగు నెలల క్రితం గాయంతో అతడు  సరైన టచ్ లో లేడు. భారత్ తో సిరీస్ లో ఆడుతున్నా రాబోయే ఐపీఎల్ లో ఏ మేరకు రాణిస్తాడనేది అనుమానమే. దీంతో డుప్లెసిస్  సారథ్యం వహిస్తున్న  ఆర్సీబీకి  బ్రాస్‌వెల్ వంటి నిఖార్సైన ఆల్ రౌండర్ అవసరం ఎంతైనా ఉంది.   అతడికి ఇదే తొలి ఐపీఎల్ సీజన్ కానుంది. 

 

బ్రాస్‌వెల్ గతేడాది  న్యూజిలాండ్ టీమ్ లోకి  ఎంట్రీ ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన  అతడు.. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ కూడా. ఇప్పటివరకు న్యూజిలాండ్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ ప్రాతినిథ్యం వహించాడు. ఆరు టెస్టులు, 19 వన్డేలు, 16 టీ20లు ఆడాడు. టెస్టులలో 224, వన్డేలలో 510, టీ20లలో 113 పరుగులు చేశాడు.  వన్డేలలో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.  టెస్టులలో 18, వన్డేలలో 15, టీ20లలో 21 వికెట్లు తీశాడు.  

భారత పర్యటనకు వచ్చిన  కివీస్ జట్టులో సభ్యుడిగా ఉన్న బ్రాస్‌వెల్.. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో వీరవిహారం చేసిన విషయం తెలిసిందే. శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో భారత్ భారీ స్కోరు  సాధించింది.   భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 349 పరుగులు చేసింది. బదులుగా కివీస్ 170కే ఆరు కీలక వికెట్లు కోల్పోయినా   బ్రాస్‌వెల్.. 78 బంతుల్లో 140 రన్స్ చేసి భారత్ ను భయపెట్టాడు. అతడి మెరుపులతో కివీస్.. 337 పరుగులు చేసింది. అలవోకగా సిక్సర్లు బాదే ఈ ఆల్ రౌండర్ ఇప్పుడు ఆర్సీబీకి ఆడనుండటంతో ఆ జట్టు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios