Royal Challengers Banglore Skipper: సుమారు దశాబ్దం పాటు ఆర్సీబీ కి కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి.. ఈ సీజన్ కు ముందు ఆ బాధ్యతల నుంచి విరమించుకున్నాడు.  రాబోయే సీజన్ లో సారథి కోసం ఆ జట్టు... 

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సుమారు దశాబ్దకాలం పాటు నాయకుడిగా వ్యవహరించిన విరాట్ కోహ్లి.. గత సీజన్ కు ముందు తాను సారథిగా తప్పుకుంటున్నాడని ప్రకటన చేశాడు. దీంతో ఆ జట్టుకు కొత్త కెప్టెన్ ను ఎన్నుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వేలం బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఆ మేరకు పలువురు కీలక ఆటగాళ్లను దక్కించుకుంది. వేలానికంటే ముందే గ్లెన్ మ్యాక్స్వెల్ ను దక్కించుకున్నా అతడిని కెప్టెన్ చేస్తారా..? లేదా..? అనేది అనుమానమే. 

ఇప్పుడు ట్విట్టర్ వేదికగా ఆ జట్టు త్వరలో కాబోయే సారథి పేరును చెప్పకనే చెప్పింది. వేలంలో ఆ జట్టు దక్కించుకున్న దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ ను సారథిగా నియమిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇదే విషయమై ఆర్సీబీ కోచింగ్ డైరెక్టర్ మైక్ హెసెన్ ఐపీఎల్ వేలానికి ముందు ఓ గదిలో సహచర సిబ్బందితో మాట్లాడుతూ.. ‘డుప్లెసిస్ దగ్గర నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అతడు గతంలో దక్షిణాఫ్రికా కు కెప్టెన్ గా కూడా చేశాడు. వేలంలో అతడికోసం మనం భారీ గా ఖర్చు చేయడానికైనా వెనుకాడకూడదు. అందుకోసం ఇతర జట్లతో కూడా పోటీ పడాలి..’ అని చెప్పుకొచ్చాడు. 

Scroll to load tweet…

ప్రస్తుతం ఆర్సీబీకి గ్లెన్ మ్యాక్స్వెల్, ఫాఫ్ డుప్లెసిస్, దినేశ్ కార్తీక్ ల రూపంలో కెప్టెన్సీ ఆప్షన్లున్నాయి. అయితే ఈ సీజన్ కు కొద్ది మ్యాచులకు మ్యాక్స్వెల్ అందుబాటులో ఉండటం లేదు. దినేశ్ కార్తీక్ రూపంలో మరో ఆప్షన్ ఉన్నా.. గతంలో అతడు కేకేఆర్ తరఫున నాయకుడిగా ఉన్నా పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ డుప్లెసిస్ మాత్రం దక్షిణాఫ్రికాను మూడు ఫార్మాట్లలో విజయవంతంగా నడిపించాడు. ఈ అనుభవం ఇప్పుడు అతడికి ఉపయోగపడనుంది. ఇది ఆర్సీబీకి కూడా పనికొస్తుందని ఆ జట్టు యాజమాన్యం భావిస్తున్నది. 

ఓపెనింగ్ బ్యాటర్ అయిన డుప్లెసిస్ కు.. అంతర్జాతీయ క్రికెట్ లో కావల్సినంత అనుభవం ఉంది. కోహ్లి మాదిరిగానే అన్ని ఫార్మాట్లలో రాణించిన డుప్లెసిస్ అయితేనే జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తున్నది. వీటన్నింటితో పాటు ఐపీఎల్ మొత్తం సీజన్ కు అతడు అందుబాటులో ఉంటాడు. దీంతో డుప్లెసిస్ వైపే ఆర్సీబీ యాజమాన్యం మొగ్గుచూపే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. దీనిపై మరో వారం రోజుల్లో స్పష్టత రానున్నది.