ఐపిఎల్ అత్యధికంగా స్టార్ ప్లేయర్లను కలిగిన జట్టు రాయల్ చాలెజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లీ, డివిలియర్స్ వంటి హిట్టర్లతో పాటు చాహల్, మోయిన్ అలీ వంటి బౌలర్లతో పటిష్టంగా వుంది. కానీ ఏం లాభం...ఇప్పటివరకు ఈ జట్టు ఒక్క ఐపిఎల్ ట్రోపిని కూడా సాధించలేకపోయింది. ఈసారి మరీ ఘోరంగా వరుస ఓటములతో లీగ్ దశనుండే గట్టెక్కలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఐపిఎల్ 2019లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచులాడిన ఆర్సిబి ఏడిట్లో ఓటమిపాలై పాయింట్స్ టేబుల్ లో చివర్లో నిలిచింది.

ఐపిఎల్ ఆరంభం నుండి గెలుపు బోణీ కొట్టలేకపోయిన ఆర్సిబి చివరకు ఏడో మ్యాచ్ లో పంజాబ్ పై మొదటి విజయాన్ని అందుకుంది. దీంతో తమ జట్టు గాడిలో పడిందని అభిమానులు కాస్త ఆనందపడ్డారు. కానీ ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. సోమవారం ముంబై ఇండియన్స్ తో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆర్సిబి మరో పరాభవాన్ని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసి 171 పరుగులు చేసిన ఆర్సిబి ఈ స్కోరును కాపాడుకోవడంలో విపలమయ్యింది. దీంతో ముంబై చేతిలో మరో ఓటమిని తప్పించుకోలేకపోయింది. 

ఈ ఓటమితో ఆర్సిబి లీగ్ దశ నుండే వెనుదిరిగే  ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ప్రతి జట్టు లీగ్ దశలో 14 మ్యాచుల్లో తలపడాల్సి వుండగా దావాపు సగానికి పైగా విజయాలు సాధించిన జట్టే  ప్లేఆప్ కు చేరుకుంటుంది. కానీ ఆర్సిబి ఇప్పటికే సగం మ్యాచుల్లో ఓటమిపాలయ్యింది కాబట్టి ప్లేఆఫ్ కు తలుపులు మూసుకుపోయినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. 

దీనిపై బెంగళూరు బౌలర్ చాహల్ స్పందిస్తూ తమకింకా ప్లేఆఫ్ అవకాశాలున్నాయంటే విశ్లేషకుల వాదనను తప్పుబట్టాడు. గత సీజన్ లో కేవలం 14 పాయింట్లతోరాజస్థాన్ జట్టే ప్లేఆఫ్ కు చేరుకున్న విషయాన్ని గుర్తుచేసిన అతడు మిగతా మ్యాచులన్ని గెలిస్తే తమకూ ఆ  అవకాశముండే చాయిస్ వుందన్నారు. తర్వాతి మ్యాచ్ లో ఏం జరుగుతుందో తెలీదు కానీ ఇప్పటికైతే తమ ప్లేఆఫ్ ఆశలు సజీవంగానే వున్నట్లు తెలిపాడు. 

ఇక ముంబై చేతిలో తమ జట్టు ఓడిపోడం గురించి చాహల్ మాట్లాడుతూ... ముంబై బ్యాట్ మెన్ హార్దిక్‌ పాండ్యా వల్లే ఈ మ్యాచ్‌ ను చేజార్చుకోవాల్సి వచ్చిందన్నాడు. 19వ ఓవర్లో
హార్దిక్‌ చెలరేగి ఏకంగా 22 పరుగులు పిండుకోవడమే తమ ఓటమికి కారణమయ్యిదన్నాడు. హార్ధిక్ ను కట్టడిచేసివుంటే ఆర్సిబి గెలిచేదని చాహల్ పేర్కొన్నాడు.