WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎలీస్ పెర్రీ తన ఆటతో బెంగళూరుకు గౌరవప్రదమైన స్కోర్లు అందించేందుకు సాయపడుతోంది.
ముంబై వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అన్ని విభాగాల్లోనూ ప్రపంచ స్థాయి ప్లేయర్లు ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనుకున్న రీతిలో రాణించలేకపోతోంది. ఈ సీజన్ లో ఐదు మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ.. అన్నింట్లోనూ ఓడి తీవ్ర విమర్శల పాలవుతున్నది. ఆ టీమ్ లో అంతో ఇంతో ఆడుతున్నదంటే ఆసీస్ ఆల్ రౌండర్ ఎలీస్ పెర్రీనే. ఈ సీజన్ లో రెండు హాఫ్ సెంచరీలతో పాటు బంతితో కూడా నిలకడగా రాణిస్తున్న పెర్రీ.. ఆట, అందంతో పాటు తన చుట్టూ ఉన్న పరిసరాలను క్లీన్ చేసుకోవడంలో ఇతర ప్లేయర్లతో పోలిస్తే చాలా ముందుంది.
సాధారణంగా డగౌట్ లలో ఉండే క్రికెటర్లు అక్కడ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, ఇతర తినుబండారాలకు సంబంధించిన ప్యాకెట్స్ తిని అక్కడే పడేస్తారు. మళ్లీ వాటి ముఖం కూడా చూడరు. మ్యాచ్ అయిపోగానే అక్కడ్నుంచి జారుకుంటారు. కానీ పెర్రీ అలా కాదు.
మార్చి 13న ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యచ్ ముగిసిన తర్వాత ఓటమి బాధతో ఆర్సీబీ ఆటగాళ్లంతా ఓ మూలన కూర్చోవడమో లేక డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి అక్కడ సేద తీరారు. కానీ పెర్రీ మాత్రం ఆర్సీబీ డగౌట్ వద్ద పడవేసి ఉన్న వాటర్ బాటిల్స్, ఇతర వ్యర్థాలను చెత్త బుట్టలోకి ఎత్తుతూ కనిపించింది. మరో క్రికెటర్ సాయం రాగా డగౌట్ ప్లేస్ ను క్లీన్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పెర్రీ ఇలా చేయడం ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా ఆమె డగౌట్ వద్ద పరిసరాలను క్లీన్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. గతంలో ఇదే విషయాన్ని ఆమెను అడగగా.. ‘నా అభిప్రాయం ప్రకారం మనం ఆడిన చోటును మనం గౌరవించాలి..’అని బదులిచ్చింది. ఆట తప్ప తమ చుట్టు పక్కల ఏమవుతుందో పట్టించుకోని క్రికెటర్లు ఉన్న ఈ రోజుల్లో పెర్రీ వంటి క్రికెటర్ ఉండటం అరుదు. ఆమె ఎంతోమందికి స్పూర్తిదాయకమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఆర్సీబీ విషయానికొస్తే ఇప్పటికే ఐదు మ్యాచ్ లను ఓడిన ఆ జట్టు నేడు యూపీ వారియర్స్ తో కీలక మ్యాచ్ లో తలపడబోతుంది. నేటి మ్యాచ్ కూడా ఓడితే అధికారికంగా ఆర్సీబీ ఈ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మరి బెంగళూరు మహిళల జట్టు ఇకనైనా మేలుకునేనా..?
